
హైదరాబాద్, వెలుగు: గోల్డ్ స్టోన్స్ అధినేత ప్రసాద్ భూ దందా అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సిమియాగూడలో బోగస్ రెవెన్యూ రికార్డులతో ప్రసాద్ ఆక్రమించుకున్న రైతుల పట్టా భూములను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఘాన్సిమియాగూడలో సర్వే నంబర్లు 3, 4లో తరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను..
గోల్డ్ స్టోన్స్ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకుందని ఆరోపించారు. సుమారు 100 మంది రైతులకు చెందిన 200 ఎకరాలను ఆక్రమించుకొని రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. తప్పడు రెవెన్యూ రికార్డులతో గోల్డ్ స్టోన్స్ సంస్థ సుప్రీంకోర్టు, హైకోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గోల్డ్ స్టోన్స్ ప్రసాద్ భూదందా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.