ఆపరేషన్ కోసమని వెళ్తే ప్రాణాలు తీసిన్రు! డాక్టర్ల నిర్లక్ష్యంతో హైదరాబాద్లో ఆర్ఎస్సై మృతి

ఆపరేషన్ కోసమని వెళ్తే ప్రాణాలు తీసిన్రు! డాక్టర్ల నిర్లక్ష్యంతో హైదరాబాద్లో ఆర్ఎస్సై మృతి

మాదాపూర్, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శస్త్రచికిత్స విఫలమై ఓ ఆర్ఎస్సై చెందాడంటూ బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. జగిత్యాలకు చెందిన తాళ్లపల్లి రాజ సాంబయ్య (60) సిద్దిపేట కమిషనరేట్​లో ఆర్ఎస్సైగా పనిచేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా కాలి తొడపై గడ్డలు ఏర్పడి ఇబ్బంది పడుతుండడంతో ఈ నెల 7న హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చేరారు. 

10వ తేదీన డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించగా, రెండు గంటలకే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను తిరిగి ఆపరేషన్ థియేటర్​కు తరలించారు. ఈ క్రమంలో బీపీ, షుగర్ అదుపుతప్పి పక్షవాతం రావడంతో మెదడుకు కూడా శస్త్రచికిత్స చేశారు. పది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సాంబయ్య.. ఈ నెల 20న చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

అయితే, కాలి గడ్డ తొలగింపు కోసం వస్తే ప్రాణాలు తీశారని, డాక్టర్ల అజాగ్రత్త వల్లే తన భర్త కోమాలోకి వెళ్లి మృతి చెందారని భార్య తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ ఇన్​స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.