పోలెండ్​లో బయటపడ్డ పేలని బాంబు.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు వేసినదిగా గుర్తింపు

 పోలెండ్​లో బయటపడ్డ పేలని బాంబు.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు వేసినదిగా గుర్తింపు
  • 14 వేల మందిని సేఫ్ ప్లేస్​కు తరలింపు.. బాంబును డిఫ్యూజ్​ చేసిన సైన్యం

వార్సా: పోలెండ్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి భారీ పేలని బాంబు బయటపడింది. దీంతో ఆ ఏరియా నుంచి వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలెండ్​లోని లుబ్లిన్ సిటీలో గురువారం ఓ బిల్డింగ్ పిల్లర్ల కోసం తవ్వుతుండగా దాదాపు 250 కిలోల భారీ పేలని బాంబు బయటపడింది. కార్మికులు వెంటనే పోలీసులు, ఆర్మీకి సమాచారం ఇచ్చారు. ఆర్మీ అధికారులు ఆ ఏరియాను తమ కంట్రోల్​లోకి తీసుకున్నారు. 
శుక్రవారం సాయంత్రం వరకు ఆ ఏరియా నుంచి 14 వేలకు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని లుబ్లిన్ టౌన్​హాల్​అధికార ప్రతినిధి కటర్జ్యాన డ్యూమా తెలిపారు. బాంబు గుర్తించిన ప్రాంతానికి వెళ్లే రోడ్లు క్లోజ్ చేశామని, గ్యాస్, పవర్, నీటి సరఫరాను ఆపేసినట్లు చెప్పారు. మిలటరీ ఇంజనీర్లు బాంబును డిప్యూజ్ ​చేస్తున్నారని తెలిపారు. బాంబు బయటపడిన ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విమానాల తయారీ ఫ్యాక్టరీ, ఎయిర్​పోర్ట్​ ఉండేవని చెప్పారు. దీని టార్గెట్​గా అప్పటి జర్మన్ ​నాజీలు పెద్ద సంఖ్యలో బాంబ్​లు వేశారన్నారు. 

అలాగే దీన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత జైలుగా, లేబర్ ​క్యాంపుగా మార్చారని డ్యూమా తెలిపారు. ఆ ప్రాంతంలో ఇలా పేలని బాంబులు గతంలో కూడా బయటపడినట్లు చెప్పారు.