‘నన్ను సొంత ఆంధ్ర బిడ్డగా భావించండి’.. సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ

‘నన్ను సొంత ఆంధ్ర బిడ్డగా భావించండి’.. సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ
  •     ఏపీ సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ
  •     ఏపీలో హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు​

అమరావతి: నన్ను మీ సొంత ఆంధ్ర బిడ్డగా భావించండి" అని ఏపీ సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కోరారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్‌‌‌‌ఏ) ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీ తదితరులు కలిసి గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదే వేదికపై ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి ఏపీ సర్కార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అధికారికంగా ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

అనంతరం అనంత్ అంబానీ మాట్లాడుతూ..శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో  భాగస్వామి కావడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రిలయన్స్‌‌‌‌పై నమ్మకం ఉంచి ఈ బృహత్తర ప్రాజెక్ట్‌‌‌‌లో భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పారు. ఐఎస్‌‌‌‌ఏ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. సంస్థ అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి తగిన మార్గనిర్దేశం చేయాలని సీఎంను కోరారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీ స్వర్ణ భూమిగా మారుతోందని అనంత్ అంబానీ ప్రశంసించారు. మోదీ వల్ల దేశంలోని ప్రతి మూలా అపూర్వమైన మార్పులు, అభివృద్ధి జరుగుతున్నదని కొనియాడారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అనంత్ అంబానీ పిలుపునిచ్చారు.