- టూరిస్టులను ఆకర్షించేలా కాటేజీలు, ట్రెక్కింగ్పాత్
- అడవిలో బుష్ బ్రేక్ ఫాస్ట్.. పక్షుల వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు
- నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: వీకెండ్ వచ్చిందంటే చాలు..సిటీ జనం ప్రశాంతత కోసం అనంతగిరి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆ ప్లేస్ పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా అటవీశాఖ సరికొత్త హంగులతో ‘ఎకో అర్బన్ పార్కు’ను రెడీ చేసింది. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో సుమారు 80 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.2.50 కోట్లతో ఈ పార్కును తీర్చిదిద్దారు. ఈ పార్కును సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోపాటు పీసీసీ సువర్ణ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇందులో టూరిస్టుల కోసం ఎంట్రన్స్ గేట్‌తోపాటు ట్రెక్కింగ్పాత్, సావనీర్ షాపు, కొండల్లో, గ్రాస్ల్యాండ్ఏరియాలో పెద్ద గజబోలు, అర్బన్ పార్కులో రెండు గజబోలు, సముద్ర నీటిమట్టానికి 700 మీటర్ల ఎత్తున పెద్ద వాచ్‌టవర్ ఏర్పాటు చేశారు. తూర్పు వైపున మరో వాచ్ టవర్ నిర్మించారు. వీటి ద్వారా అనంతగిరి ఫారెస్ట్ వ్యూను చూడొచ్చు. అంతేకాదు, ఇది మూసీ జన్మస్థలం కావడంతో సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ పార్కు ఏర్పాటుతో స్థానికంగా ఉన్న దాదాపు 20 నుంచి 40 కుటుంబాలకు ఉపాధి కలిగిందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు.
పర్యాటకులకు బుష్ బ్రేక్‌ఫాస్ట్..
పర్యాటకుల వసతి కోసం ఫారెస్ట్కార్పొరేషన్ డెవలప్మెంట్ఆధ్వర్యంలో కాటేజీలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం నాలుగు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని కాటేజీలు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. పర్యాటకుల కోసం బుష్ బ్రేక్ ఫాస్ట్, బార్డ్ వాచ్సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. దీని కోసం ఆన్లైన్ తోపాటు నేరుగా కాటేజీల దగ్గరైనా టికెట్ బుక్‌చేసుకోవచ్చు. కాటేజీల నిర్వహణ బాధ్యతలను ఎఫ్డీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది.
ఒకరోజు ఒక వ్యక్తికి రూ.3,800గా నిర్ణయించారు. ఇందులోనే బ్రేక్‌ఫాస్ట్, భోజనంతోపాటు వసతి కల్పిస్తున్నారు. ఇద్దరికి రూ.7,600 చొప్పున ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. అయితే, హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో వీకెండ్స్‌లో ఎక్కువ మంది వస్తారని, వారికి ఆహ్లాదం అందించేలా వసతులు కల్పిస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొన్నారు.
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తం: పీసీసీఎఫ్ సువర్ణ
అనంతగిరి కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పర్యాటకుల కోసం ఆకర్షణీయంగా అనంతగిరి ఎకో పార్కు డెవలప్ చేశాం. పర్యాటకులు స్టే చేసేలా సదుపాయాలు కల్పించాం. హైదరబాద్‌కు సమీపంలో ఉండటంతో ఒకరోజులోనే పార్కు సందర్శనకు వెళ్లి ఈజీ తిరిగి రావొచ్చు. ఈ పార్కుకు సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వారి కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం.

