చేపల వేటకు వెళ్లి 15 మంది జాలర్ల గల్లంతు 

చేపల వేటకు వెళ్లి 15 మంది జాలర్ల గల్లంతు 
  • నాలుగు రోజుల క్రితం సముద్రంలో ఆగిపోయిన మరబోటు
  • రక్షించమంటూ ఈనెల 16న కోస్ట్ గార్డు దళాలకు ఫోన్ చేసిన జాలర్లు

శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 15 మంది జాలర్లు గల్లంతయ్యారు. జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన ఈ జాలర్లు ఉపాధి కోసం  చెన్నైకు వలసవెళ్లారు. ఈనెల 7వ తేదీన చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి మరబోటులో చేపలవేటకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 16వ తేదీ నుంచి వీరు ఆచూకీ లేకుండా పోయారు. అయితే వీరి బోటు సముద్రం మద్యలో ఆగిపోయినట్లు కోస్ట్ గార్డు దళాలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. తమను కాపాడమంటూ వారు వేడుకున్నట్లు కోస్ట్ గార్డు దళాలు ప్రకటించాయి. తమకు కూడా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని జాలర్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. 
కేంద్ర హోంశాఖను కోరిన ఎంపీ రామ్మోహన్ 
సముద్రంలో చేపలవేటకు వెళ్లిన తమ జిల్లాకు చెందిన 15 మంది జాలర్లు సముద్రంలో గల్లంతయ్యారని.. వారిని రక్సించాలంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి కోసం చెన్నై వెళ్లిన తమ జిల్లా జాలర్లు చెన్నై నుంచి సముద్రంలోకి వెళ్లారని.. బోటు మొరాయించడంతో వారి ఆచూకీ తెలియడం లేదని ఆయన తెలియజేశారు. 
12మంది సురక్షితంగా ఉన్నట్లు చెన్నై కోస్ట్ గార్డు ప్రకటన
చేపల వేటకు వెళ్లి సముద్రంలో ఆచూకీలేకుండా పోయిన జాలర్లలో 12 మంది సురక్షితంగా ఉన్నారని చెన్నై కోస్ట్ గార్డు ప్రకటించింది. సముద్రంలో మొరాయించిన బోటు చెన్నై తీర ప్రాంతంలో గుర్తించామని తెలిపింది. వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డు దళాలు రంగంలోకి దిగి గాలిస్తుండగా చెన్నై తీర ప్రాంతంలో కనిపించారని చెన్నై కోస్టు గార్డు అధికారులు ప్రకటించడంతో జాలర్ల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వారిని సురక్షితంగా తీసుకురావాలంటూ జాలర్ల కుటుంబ సభయులు పశు సంవర్ధకశాఖ మంత్రి అప్పలరాజును కోరారు.