
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి..? ఏ అంశాలపై చర్చించాలి..? రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 నుంచి 30 అంశాలను వైసీపీ చర్చకు ప్రతిపాదించనుంది. ఈ నెల 17వ తేదీన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మరుసటిరోజు 18న ప్రవేశపెట్టే ప్రతిపాదన సైతం తాజాగా చర్చల్లోకొచ్చింది. దీనిపై ఇవాళ స్పష్టత రానుంది. ఈ సమావేశాల్లో సీఎం జగన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు. కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి.
బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు సంబంధించి 15కు పైగా ప్రధాన సమస్యలపై ఉభయసభల్లో చర్చకు పట్టుపట్టాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, నిరుద్యోగం, పోలవరం, రైతుల సమస్యలు, ప్రతిపక్షాల కార్యక్రమాలపై ప్రభుత్వ ఆంక్షలు, కేసులు వంటి పలు కీలక అంశాలపై చర్చకోసం సిద్ధమైంది. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఉదయం నివాళినర్పించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.