13 ఏళ్ల పాప బ్రిడ్జి పైపును పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది..తోసేసింది ఆ వెధవే..

13 ఏళ్ల పాప బ్రిడ్జి పైపును పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది..తోసేసింది ఆ వెధవే..

ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. వివాహితతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి..ఆమెకు పుట్టిన పిల్లలను చంపాలని నిర్ణయించుకుని బ్రిడ్జిపై నుంచి నదిలోకి తోసేశాడు. అయితే ఓ బాలిక బ్రిడ్జికి ఉన్న పైపును పట్టుకుని ప్రాణాలు రక్షించుకుంది. పైపునకు వేలాడుతూ.. పోలీసులకు ఫోన్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సుహాసిని (36) భర్తతో విడిపోయింది. వీరికి పుప్పాల లక్ష్మి సాయి కీర్తన (13) జన్మించింది. అయితే సుహాసిని భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రకాశం జిల్లాకు చెందిన  ఉలవ సురేశ్‌ (30)తో పరిచయం ఏర్పడి..అతనితో సహజీవనం చేస్తోంది. వీరికి జెర్సీ (1) జన్మించింది. అయితే సుహాసిని, సురేష్ ల  మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా సుహాసిని, ఆమె బిడ్డ పుప్పాల లక్ష్మి సాయి కీర్తన అడ్డు తొలగించుకోవాని పథకం పన్నాడు. రాజమహేంద్రవరంలో కారు కొనుగోలు చేద్దామని సుహాసినితో చెప్పిన సురేష్..సుహాసిని ఆమె ఇద్దరు పిల్లలు జెర్సీ (1), పుప్పాల లక్ష్మి సాయి కీర్తన (13)ను కారులో తీసుకెళ్లాడు. కోనసీమ జిల్లా  రావులపాలెం గౌతమి గోదావరి నది బ్రిడ్జి దగ్గరకు వద్దకు రాగానే ఫొటోలు తీసుకుందామని కిందకి దించాడు.  ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ సుహాసినితో పాటు..కీర్తనను నదిలోకి తోసేశాడు. ఆ వెంటనే జెర్సీని కూడా నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కీర్తన మాత్రం బ్రిడ్జి కేబుల్‌ పైపు పట్టుకుని ప్రాణాలు రక్షించుకుంది. తన పాకెట్లో  మెుబైల్ ఉండటంతో పోలీసులకు ఫోన్ చేసింది.  దీంతో వెంటనే పోలీసులు  ఘటనాస్థలికి చేరుకుని కీర్తనను కాపాడారు. 

లక్ష్మీ సాయి కీర్తన వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నదిలో సుహాసిని, జెర్సీలు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు నిందితుడు సురేశ్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.