అమరావతి: ఏపీలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి పడిపోతోందని, జపాన్, చైనా సహా కొన్ని ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న జనాభా క్షీణత సంక్షోభం ఏపీకి రాకూడదన్న ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వనరుల కొరత కారణంగా గతంలో జనాభాను కట్టడి చేశామని, కానీ ఇప్పుడు యువత సంఖ్య తగ్గి, వృద్ధుల శాతం పెరిగితే శ్రామిక శక్తి కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు భారం కాదని, వాళ్లే మన అసలైన సంపద అంటూ ఆయన కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా జనాభా సమతుల్యతను కాపాడేందుకు మూడో బిడ్డ పుట్టిన వెంటనే ఆ కుటుంబానికి రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు తక్షణ ఆర్థికసాయం అందిస్తామని తాజాగా ప్రకటించారు.
బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఇంకా కొనసాగుతోంది. బిహార్‌లో టీఎఫ్‌ఆర్ 2.9గా నమోదుకాగా యూపీలో 2.6, మధ్యప్రదేశ్‌లో 2.5గా ఉంది. కానీ కేరళలో 1.5, పశ్చిమ బెంగాల్‌లో 1.4 ఉండగా.. ఆ రాష్ట్రాల సరసన తెలంగాణ (1.5) కూడా చేరింది. అంటే దంపతులకు సగటున ఇద్దరు పిల్లలు కూడా పుట్టడం లేదు.
ఇది కేవలం జనాభా సమస్య మాత్రమే కాదని.. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బడులకు వెళ్లే పిల్లల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగి సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా నియోజకవర్గాల పునర్విభజన, ఆర్థిక సంఘం నిధుల సిఫార్సులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
