
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 ల సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత ఈ విండీస్ ఆల్ రౌండర్ గుడ్ బై చెప్పనున్నాడు. జమైకాకు చెందిన రస్సెల్ తన చివరి రెండు మ్యాచ్ లు తన సొంతగడ్డ సబీనా పార్క్‌లో ఆడి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియాతో తొలి టీ20కి ముందు రస్సెల్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా తన కెరీర్ లో గొప్ప మూమెంట్ గురించి చెప్పుకొచ్చాడు.
టీమిండియాతో జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ విజయం వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన కెరీర్‌లో ఒక మధురమైన క్షణంగా అభివర్ణించాడు. ఈ టోర్నమెంట్ సెమీఫైనల్లో, వెస్టిండీస్ ఆతిథ్య ఇండియాకు షాక్ ఇచ్చి 193 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో రస్సెల్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 20 బంతుల్లోనే 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్ లోనూ ఈ సీమ్ ఆల్ రౌండర్ అజింక్య రహానె వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ను రస్సెల్ గుర్తు చేసుకుంటూ తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు.
రస్సెల్ మాట్లాడుతూ.. " ఖచ్చితంగా 2016 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నా బెస్ట్ మూమెంట్. ఇండియాతో జరిగిన సెమీ-ఫైనల్ లో సిమ్మన్స్ తో కలిసి 190+ పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేశాం. ప్రేక్షకులు భారత్ జట్టుకు సపోర్ట్ చేయడంతో కొంత ఒత్తిడికి గురయ్యాను. కానీ ఆ వికెట్ చాలా మంచి వికెట్. నా మెద్దున్న స్వేచ్ఛ నాలో కాన్ఫిడెంట్ పెంచింది". అని రస్సెల్ చెప్పుకొచ్చాడు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 19.3 ఓవర్లలో 193 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో ఫైనల్ కు వెళ్లిన వెస్టిండీస్ తుది సమరంలో ఇంగ్లాండ్ పై టైటిల్ గెలుచుకొని రెండోసారి టీ20 ఛాంపియన్స్ గా అవతరించింది.
2010 లో రస్సెల్ తన టెస్ట్ క్రికెట్ ద్వారా తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గాలేలో శ్రీలంకపై ఆడిన ఈ టెస్ట్ రస్సెల్ కెరీర్ లో మొదటిది అదే చివరిది. 2011లో వన్డే, టీ20 ల్లో అరంగేట్రం చేశాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో రస్సెల్ విధ్వంసకర ఆటగాడిగా ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. వెస్టిండీస్ తరపున ఓవరాల్ గా 84 టీ20 మ్యాచ్ లాడిన ఈ విడీస్ విధ్వంసకర వీరుడు 22.00 సగటుతో 1,078 పరుగులు చేశాడు. 163.08 స్ట్రైక్ రేట్‌తో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ తన మార్క్ చూపిస్తూ 30.59 సగటుతో 61 వికెట్లు కూడా పడగొట్టాడు. 56 వన్డేల్లో 2229 పరుగులు చేశాడు. 2012, 2016లో వెస్టిండీస్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో రస్సెల్ సభ్యుడు.