Andre Russell: 15 ఏళ్ళ మెరుపులకు ముగింపు: అంతర్జాతీయ క్రికెట్‪కు రస్సెల్ రిటైర్మెంట్

Andre Russell: 15 ఏళ్ళ మెరుపులకు ముగింపు: అంతర్జాతీయ క్రికెట్‪కు రస్సెల్ రిటైర్మెంట్

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 ల సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత ఈ విండీస్ ఆల్ రౌండర్ గుడ్ బై చెప్పనున్నాడు. 37 ఏళ్ళ రస్సెల్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు ఎంపికను తర్వాత తన  రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలిపి ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. గురువారం (జూలై 18) విండీస్ క్రికెట్ రస్సెల్ రిటైర్మెంట్ గురించి తెలుపుతూ అతని రిటైర్మెంట్ వార్తను నివాళి పోస్ట్‌తో వెల్లడించింది. జమైకాకు చెందిన రస్సెల్ తన చివరి రెండు మ్యాచ్ లు తన సొంతగడ్డ సబీనా పార్క్‌లో ఆడి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రస్సెల్ స్పందించాడు.. " వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గర్వించదగ్గ విజయాలలో ఒకటి. నేను చిన్నప్పుడు, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. కానీ మీరు ఎంత ఎక్కువగా ఆటను ప్రేమిస్తే మీ విజయాలు ఎక్కువగా కనబడతాయి. ఆటపై ఉన్న ఇష్టం నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నేను వెస్టిండీస్ తరపున ఆడడాన్ని ఇష్టపడతాను. కరేబియన్ నుండి వస్తున్న నెక్స్ట్ జనరేషన్ క్రికెటర్లకు రోల్ మోడల్‌గా ఉంటూనే నా అంతర్జాతీయ కెరీర్‌ను ఉన్నతంగా ముగించాలనుకుంటున్నాను." అని రస్సెల్ తెలిపాడు.

ALSO READ : మాంచెస్టర్ టెస్టుకు ముందు బుమ్రా టెన్షన్.. నాలుగో మ్యాచ్ ఆడటంపై కొనసాగుతోన్న సస్పెన్స్..!

2010 లో రస్సెల్ తన టెస్ట్ క్రికెట్ ద్వారా తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గాలేలో శ్రీలంకపై ఆడిన ఈ టెస్ట్ రస్సెల్ కెరీర్ లో మొదటిది అదే చివరిది. 2011లో వన్డే, టీ20 ల్లో అరంగేట్రం చేశాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో రస్సెల్ విధ్వంసకర ఆటగాడిగా ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. వెస్టిండీస్ తరపున ఓవరాల్ గా 84 టీ20 మ్యాచ్ లాడిన ఈ విడీస్ విధ్వంసకర వీరుడు 22.00 సగటుతో 1,078 పరుగులు చేశాడు. 163.08 స్ట్రైక్ రేట్‌తో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ తన మార్క్ చూపిస్తూ 30.59 సగటుతో 61 వికెట్లు కూడా పడగొట్టాడు. 56 వన్డేల్లో 2229 పరుగులు చేశాడు.  2012, 2016లో వెస్టిండీస్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో రస్సెల్ సభ్యుడు.