
మాంచెస్టర్: లార్డ్స్ టెస్టులో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని వదిలేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1–2తో వెనుకంజలో ఉంది. సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఈ టైమ్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టులో ఆడతాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో విశ్రాంతినిచ్చారు.
తను ఈ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడతాడని కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఈ నెల 23న నుంచి జరిగే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం ఆసక్తి రేపుతోంది. లార్డ్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ప్రశ్నకు ఇండియా కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ సమాధానం చెప్పలేదు. అదే సమయంలో మూడో టెస్టులో చేతి వేలికి గాయమైన రిషబ్ పంత్ బాగానే ఉన్నాడని చెప్పాడు. పెద్ద గాయం కాకపోవడంతో అతను మాంచెస్టర్ టెస్టుకు సిద్ధంగా ఉంటాడని తెలపడం ఊరట కలిగించే అంశమే అయినా బుమ్రా విషయంలోనే స్పష్టత రావాల్సి ఉంది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్x కీలక మ్యాచ్
ప్రస్తుతం బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి మ్యాచ్ తర్వాత చాలా చర్చ జరుగుతోంది. ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బుమ్రా వర్క్‌లోడ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పోల్చాడు. లార్డ్స్‌లో స్టోక్స్ ఐదో రోజు ఉదయం 9.2 ఓవర్లు బౌలింగ్ చేశాడని, ఫీల్డింగ్ కూడా చేశాడని, అయినా అతని వర్క్‌లోడ్ గురించి ఎవరూ మాట్లాడరని పఠాన్ అన్నాడు. కానీ ఇండియాలో బుమ్రా విషయంలో భిన్నంగా ఉందన్నాడు. మరోవైపు నాలుగో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బుమ్రా ఇప్పటివరకు టెస్టు ఆడలేదు.
ఈ నేపథ్యంలో సిరీస్‌ను నిర్ణయించే ఈ మ్యాచ్‌లో బుమ్రాను ఆడించాలా లేదా చివరి మ్యాచ్‌కు (ది ఓవల్) సిద్ధంగా ఉంచాలా అనేది ఇప్పుడు మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడాడు. లీడ్స్‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్‌హామ్‌లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు.
లార్డ్స్‌లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తను ఎక్కువ స్పెల్స్ బౌలింగ్ చేయకుండా జాగ్రత్తపడుతోంది. కానీ, చివరి రెండు టెస్టుల్లో తనను ఎందులో బరిలోకి దింపాలో తేల్చుకోవడం కత్తిమీద సాము అవుతోంది.
బౌలర్ల విషయంలో ఇండియాకు అప్షన్లు పరిమితంగానే ఉన్నాయి. బర్మింగ్‌హామ్‌లో ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ రాణించినప్పటికీ ప్రసిద్ధ్ కృష్ణ భారీ రన్స్ ఇచ్చుకొని తేలిపోయాడు. తొలి పోరులో శార్దూల్ ఠాకూర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దాంతో, తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో బుమ్రాకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
మూడో టెస్టు ముగిసిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఇండియా మాంచెస్టర్ మ్యాచ్ కోసం గురువారం బెకెన్‌హామ్ కౌంటీ గ్రౌండ్‌లో శిక్షణ ప్రారంభించింది. బుమ్రా పూర్తి సెషన్లో ప్రాక్టీస్ చేయనున్నాడు. అక్కడ అతని ఫిట్‌నెస్‌ను పరిశీలించి, అంచనా వేసిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ నాలుగో టెస్టులో అతడిని ఆడించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది.