
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే మధ్య 2017లో జరిగిన గొడవ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని భావించిన కుంబ్లే అయిష్టంగానే కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అప్పట్లో బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) హెడ్‌గా ఉన్న వినోద్ రాయ్ పేర్కొన్నారు. తాను రాసిన ‘నాట్ జస్ట్ ఎ నైట్‌వాచ్‌మెన్: మై ఇన్నింగ్స్ విత్ బీసీసీఐ’ అనే పుస్తకంలో దీన్ని ప్రస్తావించారు. ‘ఈ విషయంలో నేను కోహ్లీ, కుంబ్లేతో మాట్లాడా. కుంబ్లే అతి క్రమశిక్షణ వల్ల టీమ్‌లోని యంగ్‌స్టర్స్ ఇబ్బంది పడుతున్నారని కోహ్లీ నాతో చెప్పాడు. అయితే టీమ్‌లో క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం ఉండేలా చూసుకోవడం ఓ కోచ్‌గా తన బాధ్యత అని కుంబ్లే అన్నాడు. అదే టైమ్‌లో సీఏసీ కుంబ్లేను హెడ్‌కోచ్‌గా తిరిగి నియమించాలని సిఫారసు చేసింది. చివరకు కెప్టెన్‌గా కోహ్లీ అభిప్రాయానికే మొగ్గు చూపాల్సి వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియలో కెప్టెన్, టీమ్ కే ప్రాధాన్యత ఇవ్వడంపై కుంబ్లే నొచ్చుకున్నాడు’ అని రాయ్ పేర్కొన్నారు.