సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కుంబ్లేనే కరెక్టు

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కుంబ్లేనే కరెక్టు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌‌, మాజీ కోచ్‌‌ అనిల్‌‌ కుంబ్లే సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌ పదవికి తగినవాడని వీరేంద్ర సెహ్వాగ్‌‌ అన్నాడు. ఆటగాళ్లకు కావాల్సిన ఆత్మవిశ్వాసం, భరోసా ఇచ్చే సామర్థ్యం కుంబ్లేలో ఉందని తెలిపాడు. అయితే సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌కి ఇచ్చే జీతాన్ని బీసీసీఐ పెంచాలని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరూ సూచించాడు.  ప్లేయర్‌‌గా సచిన్‌‌, సౌరవ్‌‌, ద్రవిడ్‌‌ వంటి వాళ్లతో ఆడిన అనుభవం, కోచ్‌‌గా యువ క్రికెటర్లతో సాన్నిహిత్యం కలిగిన కుంబ్లే సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌ పదవికి తగిన వ్యక్తి అని చెప్పాడు. అయితే సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌ల జీతాన్ని (ప్రస్తుతం రూ. కోటి) పెంచితే మరింత మంది ఆ పదవి కోసం ముందుకొస్తారన్నాడు. నిబంధనలు, పరిమితుల వల్ల చైర్మన్‌‌ పదవిపై తనకి ఆసక్తి లేదని చెప్పిన వీరూ.. ఎంవీ శ్రీధర్‌‌ సూచన వల్లే 2017లో కోచ్‌‌ పదవికి దరఖాస్తు చేసినట్లు చెప్పాడు. ఈ సారి ఎవరూ అడగనందున దరఖాస్తు చేయలేదన్నాడు. కాన్‌‌ఫ్లిక్ట్‌‌ ఆఫ్‌‌ ఇంట్రస్ట్‌‌పై మాట్లాడుతూ  ఓ సెలెక్టర్‌‌ అకాడమీ నడిపితే తప్పే, కానీ ఓ నేషనల్‌‌ కోచ్‌‌ అకాడమీ నడిపితే తప్పేంటో అర్థం కావడం లేదని చెప్పాడు. విండీస్‌‌తో ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో ఇండియా ఐదుగురు బౌలర్ల వ్యూహంతో వెళ్తే రహానెను ఆడించడం బెటర్‌‌  అని సెహ్వాగ్​ అన్నాడు.