పంజాగుట్ట, వెలుగు: నగరంలో వీధి శునకాలపై జరుగుతున్న హింసను అరికట్టాలని ఆరుద్ర ఫర్ ఎనిమల్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సొసైటీ ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సొసైటీ సభ్యుడు డి.హన్మంత్‌రావు మాట్లాడారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీధి కుక్కలను హింసిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కుక్కల రక్తాన్ని సేకరించి సాచెట్‌లలో నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
షేక్‌పేట ప్రాంతంలోని కొన్ని వెటర్నరీ హాస్పిటల్స్‌లో కుక్కల నుంచి అధిక మోతాదులో రక్తం సేకరించడం, భారీ మోతాదులో మందులు ఇవ్వడం, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ చర్యలు జంతువుల ఆరోగ్యానికి ముప్పు కలిగించడమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు జోక్యం చేసుకుని అనుమతిలేని వెటర్నరీ క్లినిక్‌లు, బ్లడ్ బ్యాంకులపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సొసైటీ సభ్యులు బాలకృష్ణ, హరిణి, శివ, ధార తదితరులు పాల్గొన్నారు.
