వరంగల్​ జూపార్క్​లో చలికి వణుకుతున్న జంతువులు

వరంగల్​ జూపార్క్​లో చలికి వణుకుతున్న జంతువులు

వరంగల్‍, వెలుగు: వరంగల్​జూపార్క్​లో వన్యప్రాణులు చలికి వణుకుతున్నాయి. పొద్దెక్కేదాక జంతువులు, పక్షులు ఎన్‍క్లోజర్ల నుంచి బయటకు రావడం లేదు. చలి నుంచి కాపాడేందుకు పక్షులు, జంతువుల ఎన్‍క్లోజర్ల చుట్టూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జూపార్కులో వణికిస్తున్న చలి, మంచుచలితో ఉదయం సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో మూగజీవాలు చలికి వణుకుతున్నాయి. హనుమకొండ హంటర్‍రోడ్‍లోని జూపార్కులో దాదాపు 230 రకాల వన్యప్రాణులున్నాయి. ఉదయం 9 గంటలు తర్వాత గానీ అవి ఎన్‍క్లోజర్‍ దాటి బయటకు రావట్లేదు. సాయంత్రం ఐదు గంటలకే లోపలకు వెళుతున్నాయి. రామచిలుకలు, వివిధ రకాల పక్షులు, నెమళ్లు వాటి గూళ్లలోకి చేరుతున్నాయి.  డాక్టర్ల పర్యవేక్షణలో పులులు, మొసళ్లు, ఎలుగుబంట్లు, జంగిల్‍ క్యాట్, దుప్పులు, జింకలు, ఆస్ట్రిచ్‍, పక్షులకు గుడ్లు, పాలకూర, క్యాబేజీ, పూదిన, కొత్తిమీర, కరివేపాకును ఆహారంగా అందిస్తున్నారు. ఒంట్లో వేడి పెంచడానికి ప్రోటీన్స్, కాల్షియం పెంచేలా పౌడర్లు, సిరప్స్​, ఫ్యాట్‍ ఫుడ్‍ ఇస్తున్నారు. పక్షులకు స్పెషల్‍ టానిక్​లతో పాటు తాగడానికి వేడినీళ్లు పెడుతున్నారు.  

తాబేళ్లకు ఇసుక.. పక్షులకు గన్నీ మ్యాట్స్​

జూపార్కులో పెద్ద మొత్తంలో ఉన్న తాబేళ్ల రక్షణకు ఇసుక తెప్పించారు. అవి తిరిగే ప్రాంతంలో గతంలో ఉన్నమట్టి, ఇసుకను తొలగించి కొత్తగా 4 ఇంచుల మందంతో ఇసుక పోశారు. సాయంత్రం కాగానే జంతువుల ఎన్‍క్లోజర్ల చుట్టూ గ్రీన్‍ మ్యాట్‍ ఏర్పాటు చేస్తున్నారు. చల్లటి గాలులు, మంచును తట్టుకోలేని పక్షుల కోసం ఎన్‍క్లోజర్‍ చుట్టూ  పీచు తట్లు, గన్నీ మ్యాట్లను  రెండుమూడు వరుసల్లో ఏర్పాటు చేశారు. బోను లోపల భాగంలో పక్షులకు వెచ్చదనం ఉండేలా కుండలు అందులో ఎండుగడ్డి పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యరశ్మి పడేలా పగటిపూట ఎన్‍క్లోజర్‍ చుట్టూ ఉండే తట్టు సంచులను తొలగిస్తున్నారు.