వరంగల్ సిటీ/ ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ పరిధి జెమినీ థియేటర్ సమీపంలోని ఈద్గాలో చేపట్టిన అభివృద్ధి పనులను రంజాన్ కు ముందే పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం వరంగల్ ఎంజీఎం సర్కిల్ లో శిశు సంరక్షణ ప్రతిబింబించే విధంగా రూ.35 లక్షలతో ఏర్పాటుచేసిన ప్రతిమను, మఠ్వాడ ఈద్గాలో రూ.కోటితో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, సత్య శారదతో కలిసి ప్రారంభించారు.
అంతకుముందు 12, 33వ డివిజన్లలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి, లబ్ధిదారులైన ఆడెపు కల్పన ప్రవీణ్‌కుమార్, నరహరిశెట్టి రమాదేవి కుటుంబ సభ్యులకు కొత్తబట్టలు పెట్టారు. 40వ డివిజన్లో రూ.కోటీ 40 లక్షలతో సీసీ రోడ్డు, శ్మశాన వాటిక, గౌడ సంఘం, మైనార్టీ కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
