- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ఆలయ అభివృద్ధిపై ఆరా
మంగపేట/ వెంకటాపురం, వెలుగు: మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని స్వామివారి దేవాలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా, పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అర్చకులు ఆలయ విశిష్టతను వారికి వివరించగా, అభివృద్ధి కోసం కావాల్సిన ఏర్పాట్లపై ఈవోను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంతాన్ని చింతామణి జలపాతాన్ని ఆలయ పరిసరాల్లో మంత్రులు తిరిగి పరిశీలించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు ముఖ్యమంత్రి ఆలోచనలతోనే మేడారంలో 200 ఏండ్లు చెక్కుచెదరకుండా అభివృద్ధి పనులు చేశామని, జాతరను నిర్వహించామన్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో బాసర, మేడారం, మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి, భద్రాచలం వరకు దేవాలయాలు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, అడిషనల్కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఈవో మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ములుగు జిల్లా పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి పర్యటించారు. వెంకటాపురంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను
సన్మానించారు.
శ్రీరామనవమి ఏర్పాట్లు బాగుండాలి
భద్రాచలం, వెలుగు : ఈ నెల 27న భద్రాచలంలో జరిగే శ్రీరామనవమికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం స్థానిక సబ్‌కలెక్టర్ ఆఫీస్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాదం క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలన్నారు. భద్రాచలం వచ్చే రోడ్లపై గుంతలు లేకుండా చర్యలు చేపట్టాలని, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను ఆదేశించారు.
భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే రోడ్డుపై ప్యాచ్ వర్క్‌లు చేయాలని సూచించారు. సమాచార కేంద్రాలు సమర్ధవంతంగా నిర్వహించాలని, మేడారం జాతరలో తలెత్తిన లోపాలు ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నందున భద్రత విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని ఎస్పీ రోహిత్‌రాజ్‌కు సూచించారు. అన్ని శాఖల ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ అంకిత్‌ను ఆదేశించారు.
రివ్యూలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, ఈవో దామోదర్‌రావు పాల్గొన్నారు. కాగా, రివ్యూకు ఆర్టీసీ ఆఫీసర్లు హాజరుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఆఫీసర్లకు షోకాజ్‌నోటీసు జారీ చేయాలని కలెక్టర్ అంకిత్‌ను ఆదేశించారు. అనంతరం చర్లలో 30 పడకల హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
