హసన్ పర్తి, వెలుగు : ఓరుగల్లు సమగ్ర అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఆదివారం 56వ డివిజన్ గోపాలపురం ఊర చెరువు ముంపు బాధితులు కోసం శాశ్వత పరిష్కారానికి రిటైనింగ్ వాల్ కోసం రూ.4 కోట్లు మంజూరు చేసినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యే నాగరాజును సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 1/3 నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, వివేక్ కాలనీ అధ్యక్షుడు మర్రి ప్రభాకర్, మహిళా అధ్యక్షురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.
