అంజన్న నిజరూప దర్శనం.. 60 ఏండ్ల తర్వాత చందనాన్ని తొలగించనున్న అర్చకులు..

అంజన్న నిజరూప దర్శనం.. 60 ఏండ్ల తర్వాత చందనాన్ని తొలగించనున్న అర్చకులు..
  • నవంబర్ 15 నుంచి 20 వరకు చందనోత్సవం

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం త్వరలో భక్తులకు కనువిందు చేయనుంది. 60 ఏండ్లుగా అంతరాలయంలోని స్వామివారి మూలవిరాట్టుకు ఉన్న చందనాన్ని తొలగించనున్నారు. నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు కొండగట్టులో చందనోత్సవం నిర్వహించనున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమానికి అర్చకులు, అధికారులు ముహూర్తం ఖరారు చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

శనివారం కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. 

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్వామివారికి చందనోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రూ.35 కోట్ల నిధులతో నిర్మించనున్న 100 గదుల సత్రానికి సంబంధించి టెండర్ ప్రక్రియ ముగింపు దశలో ఉందని వెల్లడించారు.