భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వరదలు, అటవీ ప్రాంతాల్లో సంభవించే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పక్కాగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. ఇందుకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ చేయాలన్నారు. ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్ మాట్లాడుతూ ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వాతావరణ మార్పుల ప్రభావంతో తక్కువ టైంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వస్తాయన్నారు. అగ్నిప్రమాదాలతో అటవీ ప్రాంతాలు నష్టపోతున్నామని తెలిపారు. ప్రతి శాఖలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్లుడి.వేణుగోపాల్, విద్యా చందన, డీఎఫ్‌వో కృష్ణ గౌడ్, ఆర్డీవో మధు, సీపీవో సంజీవ్‌రావు, మిషన్ భగీరథ అధికారి తిరుమలేశ్, ఆర్అండ్బీ ఈఈ నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ అధికారి త్రినాథ్ బాబు పాల్గొన్నారు.
