న్యాయవ్యవస్థే సుప్రీం.. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలి : ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే

న్యాయవ్యవస్థే సుప్రీం.. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలి :  ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే
  • కేజ్రీవాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై అన్నా హజారే హర్షం

పుణె: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) చీఫ్ అరవింద్‌ కేజ్రీవాల్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేయడం పల్ల ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమైందని, కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని సూచించారు. శుక్రవారం మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మన దేశం విభిన్న పార్టీలు, కులాలు, మతాలతో కలిసి ఉందని, న్యాయవ్యవస్థ బలంగా ఉండబట్టే దేశం ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పును అందరూ ఆమోదించి తీరాలన్నారు. 

గతంలో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అప్పట్లో వారిపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, కోర్టు తీర్పు రాలేదన్నారు. కోర్టు నిర్ణయాన్ని మనం గౌరవించాలని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా తన పాత కార్యకర్తలు అని అన్నారు. ఇకపై మీ గురించి, మీ పార్టీ గురించి మాత్రమే కాకుండా, సమాజం కోసం, దేశం కోసం కూడా పనిచేయాలని కేజ్రీవాల్‌కు అన్నా హజారే సూచించారు.