మైనారిటీలకు సబ్​ప్లాన్..ఆరు నెలల్లోనే కులగణన, న్యాయమైన రిజర్వేషన్లు

మైనారిటీలకు సబ్​ప్లాన్..ఆరు నెలల్లోనే కులగణన, న్యాయమైన రిజర్వేషన్లు
  • మైనారిటీ డిక్లరేషన్​లో ప్రకటించిన కాంగ్రెస్​
  • మైనారిటీ బడ్జెట్​ రూ.4,000 కోట్లకు పెంపు
  • చదువుకునేటోళ్లకు రూ.10 వేల నుంచి  5 లక్షల దాకా ఆర్థిక సాయం
  • ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
  • ఇండ్లు లేనివాళ్లకు ఇంటి స్థలం.. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం

హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు కులగణనతో పాటు మైనారిటీల జనాభాను లెక్కించి ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో న్యాయమైన రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. మైనారిటీ బడ్జెట్​ను రూ.4000 కోట్లకు పెంచుతామని.. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ మాదిరిగానే మైనారిటీ సబ్​ ప్లాన్​ను అమలు చేస్తామని ప్రకటించింది. నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించేందుకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని తెలిపింది.

గురువారం హైదరాబాద్​ కన్వెన్షన్​ సెంటర్​లో షబ్బీర్​ అలీ నేతృత్వంలో నిర్వహించిన మైనారిటీల సమావేశంలో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్​ సల్మాన్​ ఖుర్షీద్​ ‘మైనారిటీ డిక్లరేషన్’ను విడుదల చేశారు. పీహెచ్​డీ, ఎంఫిల్  పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్​, సిక్కు ఇతర మైనారిటీల యువతకు ‘‘అబ్దుల్​కలాం తౌఫా ఏ తలీమ్’’ స్కీమ్​ కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని డిక్లరేషన్​లో పేర్కొన్నారు. పీజీ పూర్తిచేసిన వారికి రూ.లక్ష,  డిగ్రీ చదివిన వారికి రూ.25 వేలు, ఇంటర్​ పూర్తి చేసిన వారికి రూ.15 వేలు, టెన్త్​ క్లాస్​ పూర్తి చేసినవారికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.

మైనారిటీ డిక్లరేషన్​లోని మరిన్ని అంశాలు..

  • తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్​ కార్పొరేషన్ ​ఏర్పాటు. మైనారిటీ కార్పొరేషన్​ 
  • సంస్థల్లో ఖాళీల భర్తీ.
  • ఉర్దూ మీడియం టీచర్ల 
  • నియామకానికి ప్రత్యేక డీఎస్సీ.
  • హక్కులు, సంస్కృతి సంప్రదాయాల రక్షణ.
  • ఇమామ్​లు, మౌజిమ్​లు, ఖాదీమ్​లు, పాస్టర్లు, గ్రంథిలతోపాటు అన్ని మైనారిటీల మత పెద్దలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల గౌరవ వేతనం. 
  • వక్ఫ్​ బోర్డు భూమి, ఆస్తుల డిజిటలైజేషన్. 
  • ఆక్రమణలకు గురైన ఆస్తులను తిరిగి తీసుకుని 
  • రిజిస్టర్​ చేయడం. 
  • ముస్లిం, క్రిస్టియన్  శ్మశాన వాటికల 
  • కోసం భూమి.
  • ఇండ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ 
  • ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి స్థలం. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం.
  • కొత్తగా పెండ్లయిన ముస్లిం, క్రిస్టియన్​, సిక్కులు సహా ఇతర మైనారిటీల జంటలకు రూ.1.60 లక్షల ఆర్థిక సాయం.
  • సెట్విన్​, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పునరుద్ధరణ.
  • ఓల్డ్​ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ‘కులీ కుతుబ్​ షా అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ’ ఏర్పాటు.