సికింద్రాబాద్​ బీజేపీలో వర్గపోరు.. రెబల్గా ​పోటీ

సికింద్రాబాద్​ బీజేపీలో వర్గపోరు..  రెబల్గా ​పోటీ
  • టికెట్ ఇవ్వకపోవడంతోనే పోటీకి నిర్ణయం

సికింద్రాబాద్​, వెలుగు :  సికింద్రాబాద్​ బీజేపీలో వర్గపోరు తీవ్రమైంది. ఏండ్లుగా  పార్టీని నమ్ముకుంటే తనకు ఇవ్వకుండా, మరోనేత సారంగపాణి కి టిక్కెట్ ఇవ్వడంపై బీజేపీ సీనియర్​నేత బండపెల్లి సతీశ్  తిరుగుబాటు చేశారు. బుధవారం ఆయన నామాలగుండులోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేటర్​గా గెలవలేని , పార్టీలో స్థిరంగా లేని వారికి టికెట్లు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం నిర్ణయం విని క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు షాక్​ తిన్నారని పేర్కొన్నారు.

సర్వే ఆధారంగా టికెట్ కేటాయింపు జరుగుతుందని నమ్మించిన అధిష్టానం చివరికి పది పార్టీలు మారిన వ్యక్తికి, ఒక్క శాతం కూడా ప్రజల మద్దతు లేని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పార్టీలో అనేక అవమానాలు జరిగినప్పటికీ సహనాన్ని కోల్పోలేదన్నారు.  తనకు టికెట్​ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ, పార్టీ శ్రేణులంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడితే నిలవరించానన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీకి చెడ్డపేరు రావద్దనే ఉద్ధేశంతో సహనంతో ఉన్నామన్నారు. మిత్రుల సూచనల మేరకు సికింద్రాబాద్ ​నుంచి బీజేపీ రెబల్​అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.