- మూడేళ్లకోసారి కాకుండా ఏడాదికోసారి లెక్కల తనిఖీ
- తప్పుడు లెక్కలకు కళ్లెం వేసేలా టీఏఎఫ్‌ఆర్‌సీ ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మూడేళ్లకోసారి ఆడిటింగ్ విధానానికి గుడ్‌బై చెప్పి, ఇకపై ప్రతిఏటా కాలేజీల ఆదాయ-వ్యయాలపై తనిఖీలు నిర్వహించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) యోచిస్తోంది.
ఈ కొత్త విధానంతో ఫీజుల ఖరారులో పారదర్శకత పెరగడమే కాకుండా, తప్పుడు లెక్కలతో ఫీజులు పెంచే కాలేజీలకు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ వ్యవస్థ అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఈడీ, బీపీఈడీ వంటి కోర్సులకు సంబంధించి కాలేజీలు సమర్పించే మూడేళ్ల ఆర్థిక లెక్కల ఆధారంగా ఫీజులు నిర్ణయిస్తున్నారు.
అయితే, ఒకేసారి వందల కాలేజీల డేటాను ఆడిట్ చేయడం అధికారులకు భారంగా మారుతోంది. సమయం తక్కువగా ఉండటంతో కాలేజీలు ఇచ్చిన లెక్కలనే ఆధారంగా తీసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొన్ని కాలేజీలు లేని వసతులను ఉన్నట్లుగా చూపిస్తూ, ఖర్చులను అధికంగా చూపి ఫీజులను పెంచుతున్నాయని అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడానికి అవకాశం లేకపోవడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది.
ఏటా ఆడిటింగ్.. మూడో ఏడాది ఈజీ..
ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఏడాది ఆడిట్ చేయడమే సరైన మార్గమని టీఏఎఫ్ఆర్సీ అభిప్రాయపడుతోంది. ఏటా లెక్కలు పరిశీలిస్తే మూడో ఏడాది ఫీజులు ఖరారు చేయడం సులభమవుతుందని, కాలేజీలు కూడా తప్పుడు సమాచారం ఇవ్వడానికి వెనుకాడతాయని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఇటీవల జరిగిన టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
వచ్చే ఏడాది నుంచే..
వచ్చే 2026–-27 విద్యాసంవత్సరం నుంచే ఈ వార్షిక ఆడిటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ లేదా ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి, కాలేజీలు తమ వార్షిక ఆర్థిక వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేసేలా నిబంధనలు రూపొందించనున్నారు. మొదటగా 2025–-26 ఆర్థిక లెక్కలను పరిశీలించనున్నారు.
టీఏఎఫ్ఆర్సీ అధికారులు కూడా.. ప్రతి మూడేండ్ల కోసారి ఆ ఆరు నెలలు మాత్రమే ఎక్కువ బీజీగా ఉంటున్నారు. ఈ కొత్త విధానం అమలైతే ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే కాలేజీలకు కళ్లెం పడుతుందని, వాస్తవంగా మెరుగైన సౌకర్యాలు కల్పించే కాలేజీలకే న్యాయం జరుగుతుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
