హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌‌లో మరోసారి విభేదాలు

హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌‌లో మరోసారి విభేదాలు

ఈ నెల 20 నిర్వహణకు అనుమతివ్వాలని పోలీసులకు సెక్రటరీ రిక్వెస్ట్‌

వద్దంటూ లెటర్‌ రాసిన ప్రెసిడెంట్‌ అజర్‌
జాయింట్​ రిప్రజెంటేషన్‌ ఇవ్వాలన్న రాచకొండ సీపీ

హైదరాబాద్‌‌, వెలుగు: అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ సారథ్యంలోని హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ)లో వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. అంబుడ్స్‌‌మన్‌‌ నియామకంపై రచ్చ చల్లారకముందే యాన్యువల్‌‌ జనరల్‌‌ బాడీ మీటింగ్ (ఏజీఎం) విషయంలో ప్రెసిడెంట్‌‌ అజరుద్దీన్‌‌, సెక్రటరీ విజయానంద్‌‌ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఏజీఎంకు పర్మిషన్‌‌ ఇవ్వాలని సెక్రటరీ, వద్దంటూ ప్రెసిడెంట్‌‌ రాచకొండ పోలీస్‌‌ కమిషనర్‌‌కు వేర్వేరు లేఖలు రాశారు. దాంతో, జాయింట్‌‌ లెటర్‌‌ ఇవ్వాలని సీపీ ప్రత్యుత్తరం పంపడంతో అసోసియేషన్‌‌లో వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. వాస్తవానికి గత నెల 29వ తేదీనే ప్లాన్‌‌ చేసిన ఏజీఎం.. జీహెచ్‌‌ఎంసీ ఎలక్షన్స్‌‌ కారణంగా వాయిదా పడింది. దాంతో, ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఉప్పల్‌‌ ఓపెన్‌‌ స్టేడియంలో  ఏజీఎం నిర్వహించాలని విజయానంద్‌‌ నిర్ణయించారు. కరోనా ప్రొటోకాల్స్‌‌ పాటిస్తూ  200 నుంచి 250 మెంబర్స్‌‌తో ఈ సమావేశం నిర్వహించేందుకు పర్మిషన్‌‌ ఇవ్వాలని కోరుతూ  సీపీని రిక్వెస్ట్‌‌ చేశాడు. అయితే, తనను గానీ, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ గానీ సంప్రదించకుండానే విజయానంద్‌‌ ఏజీఎం ప్లాన్‌‌ చేశారు కాబట్టి  పర్మిషన్‌‌ రిజెక్ట్‌‌ చేయాలంటూ ప్రెసిడెంట్‌‌ అజరుద్దీన్‌‌ లెటర్‌‌ రాశాడు. ఈ విషయంపై  రాచకొండ సీపీ స్పందించారు. ఏజీఎంపై  ప్రెసిడెంట్‌‌, సెక్రటరీ ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారన్నారు. కాబట్టి ఇద్దరూ జాయింట్‌‌ రిప్రజెంటేషన్‌‌ ఇవ్వాలని సూచించారు. అలాగే, ఏజీఎం నిర్వహణకు బోర్డు తీర్మానం కాపీతో పాటు మీటింగ్‌‌ ఎక్కడ జరుగుతుంది, ఎంత మంది హాజరవుతారనే దానిపై పూర్తి వివరాలు అందిస్తేనే పర్మిషన్‌‌ ఇస్తానని స్పష్టం చేశారు.

గద్దె దించుతారన్న భయంతోనే?

తనను గద్దెదించుతారన్న భయంతోనే ఏజీఎం నిర్వహణకు అజర్‌‌ అభ్యంతరం తెలుపుతున్నాడని హెచ్‌‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పటి నుంచి అజర్‌‌కు, మిగతా  సభ్యులకు  పడడం లేదు. అజర్‌‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ సెక్రటరీ సహా ఇతర ఆఫీస్‌‌ బేరర్లు అతనిపై ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించారు. అంబుడ్స్‌‌మన్‌‌ నియామకంపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. తాజాగా క్రికెట్‌‌ రీస్టార్ట్‌‌  వద్దంటున్న అజర్‌‌ వైఖరిపై అంతా గుర్రుగా ఉన్నారు. త్రీ డే లీగ్‌‌ కోసం సెక్రటరీ, ఇతర అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మెంబర్లు నడుం బిగించారు. ఇప్పటికే 200 పైచిలుకు క్రికెటర్లకు జింఖానా గ్రౌండ్‌‌లో కొవిడ్‌‌ పరీక్షలు నిర్వహించారు. కానీ, కరోనా రిస్క్‌‌ ఉందని చెబుతూ అజర్‌‌ ఒక్కడే ఆట వద్దంటున్నాడు. దీంతో, ప్రతి విషయంలో మోకాలడ్డుతున్న అజర్‌‌పై వేటు వేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఏజీఎంలోనే అజర్‌‌పై  సస్పెన్షన్‌‌ తీర్మానం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకే  అజర్ ఏజీఎంకు పర్మిషన్‌‌ ఇవ్వొద్దంటూ సీపీకి లేఖ రాశాడని అసోసియేషన్‌‌ వర్గాలు భావిస్తున్నాయి.

For More News..

అయ్యప్పా.. నీ దర్శనమెట్లా!

విదేశాలను మించిన జాబ్ ఆఫర్స్ ఇక్కడే

కొత్త సబ్‌‌స్క్రయిబర్ల కోసం ఓటీటీ ప్లాన్స్​