తెలంగాణలో మరో 150 వైన్స్‌‌‌‌? 

తెలంగాణలో మరో 150 వైన్స్‌‌‌‌? 
  • రెండు మూడు నెలల్లో కొత్త మండలాల్లో ఏర్పాటు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో మరిన్ని మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రెండు మూడు నెలల్లో కొత్త మండలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి లిస్ట్‌‌‌‌ రెడీ చేయాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. దీంతో ఆబ్కారీ శాఖ అధికారులు ఏ ప్రాంతంలో వైన్​ షాపు​ ఏర్పాటు చేయాలన్నదానిపై దృష్టి పెట్టారు. కొత్తగా 150 దాకా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 వైన్స్‌‌‌‌ ఉన్నాయి. ఎక్సైజ్‌‌‌‌ పాలసీలో భాగంగా రెండేండ్లకోసారి వైన్​ షాపులకు లైసెన్స్‌‌‌‌ జారీ చేస్తారు. లక్కీ డ్రా ద్వారా లైసెన్స్‌‌‌‌ ఇస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ 31న ఎక్సైజ్‌‌‌‌ పాలసీ గడువు ముగియనుంది. దీంతో వివిధ మార్పులు, చేర్పులతో నవంబర్‌‌‌‌ నుంచి కొత్త పాలసీని అమల్లోకి తీసుకురానున్నారు. అప్లికేషన్‌‌‌‌ ఫీజు, లైసెన్స్‌‌‌‌ ఫీజు పెంపు లేదా తగ్గింపు, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ తదితర కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ పాలసీతోపాటే కొత్తగా 150 వైన్​ షాపులకు పర్మిషన్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

పెద్ద మండలమైతే రెండు వైన్స్​
రాష్ట్ర ఏర్పాటుకు ముందు 459 మండలాలు ఉండేవి. కొత్తగా 133 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం మండలాలు 592కు చేరాయి. ఇటీవల కొత్తగా 159 బార్లకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చారు. ఇదే క్రమంలో  వైన్​ షాపులనూ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మండలాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఎక్కడెక్కడ  వైన్స్‌‌‌‌  ఏర్పాటు చేయొచ్చు..? ఏయే మండలాల్లో అవకాశం ఉంది..? మేజర్‌‌‌‌ గ్రామపంచాయతీల్లో పరిస్థితి ఏంది..? తదితర వివరాలపై ఆరా తీస్తోంది. జనాభా ప్రాతిపదికన వైన్స్‌‌‌‌కు పర్మిషన్‌‌‌‌ ఇవ్వనున్నారు. కొన్ని మండలాల్లో ఒక్కో వైన్​ షాపు, పెద్ద మండలమైతే రెండు వైన్​  షాపులు ఏర్పాటు చేసే చాన్స్​ ఉంది. మేజర్‌‌‌‌ గ్రామ పంచాయతీల్లోనూ వైన్స్​కు పర్మిషన్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 150 దాకా కొత్త వైన్స్‌‌‌‌  ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ ఉంది. 
అప్లికేషన్‌‌‌‌, లైసెన్స్‌‌‌‌ ఫీజులతో మస్తు ఆదాయం
గతంలో వైన్​  షాపుల లైసెన్స్‌‌‌‌ ఫీజుతోనే సర్కారుకు రూ. 976 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కో అప్లికేషన్‌‌‌‌కు రూ.  2 లక్షలు తీసుకున్నారు. లైసెన్స్‌‌‌‌ ఫీజు నాలుగు స్లాబులుగా విభజించారు. రూ. 30 లక్షల నుంచి మొదలుకొని రూ. 40 లక్షల వరకు నిర్ణయించారు. ఇప్పుడు కొత్తగా 150 వైన్​ షాపులకు పర్మిషన్​ ఇస్తే.. వాటి అప్లికేషన్‌‌‌‌, లైసెన్స్‌‌‌‌ ఫీజులతో మరింత ఆదాయం రానుంది.