ఓటర్ల నమోదు ప్రారంభంతో టీచర్లలో హడావుడి

ఓటర్ల నమోదు ప్రారంభంతో టీచర్లలో హడావుడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనుండగా, మహబూబ్‌‌నగర్‌‌– రంగారెడ్డి– హైదరాబాద్‌‌ టీచర్ సెగ్మెంట్​ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్​రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి29తో ముగియనున్నందున ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఆదివారం నుంచే ఓటర్ల నమోదు మొదలుకావడంతో టీచర్లలో హడావుడి షురువైంది. వచ్చేనెల 7 వరకూ ఓటర్ల నమోదు చేపట్టి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ సారి 25 వేల మంది టీచర్ ఓటర్లు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జనరల్ ఎన్నికలకు టైమ్ దగ్గరగా ఉండటంతో ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికనూ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అభ్యర్థులకు అన్ని పార్టీలు బహిరంగంగానే  మద్దతు ప్రకటించే అవకాశముంది.  

పోటీకి చాలామంది రెడీ 

ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో పీఆర్టీయూ, టీఎస్​యూటీఎఫ్​, ఎస్​టీయూటీఎస్​, తపస్ తదితర సంఘాలు పోటీలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్​రెడ్డి పీఆర్టీయూ నుంచి మరోసారి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు మాణిక్​రెడ్డి ఈసారి కూడా పోటీ చేసే అవకాశముంది. మరోపక్క ఎస్టీయూటీఎస్​ తరపున మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు బరిలో నిలిచేందుకు ఆ సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే యూటీఎఫ్ నాయకత్వంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఎస్టీయూటీఎస్ నేతృత్వంలో జాక్టో టీచర్ల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఈ రెండు సంఘాలూ ఆయా జేఏసీల్లోని సంఘాలతో చర్చలు జరుపుతున్నాయి. బీజేపీ మద్దతుతో తపస్ తరపున పోటీ చేసేందుకు వెంకట్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సంఘాల తరపున విజయ్ కుమార్ పోటీకి రెడీ అవుతున్నారు.

జనార్దన్​రెడ్డికి టికెట్ దక్కేనా? 

ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన జనార్దన్ రెడ్డికి ఈ సారి గట్టి పోటీ ఎదురవుతోంది. టీఆర్ఎస్ కు పూర్తిగా అనుబంధంగా మారి పనిచేయడం, వరుసగా రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతుండటంతో టీచర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వం కూడా కొత్త వారికి చాన్స్ ఇవ్వాలనే యోచనలో ఉంది. కానీ, ఆ సెగ్మెంట్ పరిధిలోని 9 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్​రెడ్డికి సీటు ఇవ్వాలని రాష్ట్ర కమిటీకి లెటర్​ పెట్టినట్టు తెలిసింది. అయితే, సంఘం బైలా ప్రకారం 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల మీటింగ్​లో అభ్యర్థిని ప్రకటించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. పీఆర్టీయూ నుంచి ఆ సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తుండటంతో ఈ ఇద్దరిలో కేసీఆర్ ఎవరిపేరు సూచిస్తే.. వారికే పీఆర్టీయూ మద్దతిచ్చే అవకాశముంది.