Vishal vs Lyca: లైకా కేసులో విశాల్‌కు భారీ ఎదురుదెబ్బ.. రూ.10 కోట్లు కట్టాల్సిందే అని హైకోర్టు స్పష్టం

Vishal vs Lyca: లైకా కేసులో విశాల్‌కు భారీ ఎదురుదెబ్బ.. రూ.10 కోట్లు కట్టాల్సిందే అని హైకోర్టు స్పష్టం

తమిళ హీరో-నిర్మాత విశాల్కు మద్రాస్ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ‘లైకా ప్రొడక్షన్స్‌’ దాఖలు చేసిన రికవరీ కేసులో.. కోర్టు విధించిన షరతులను అమలు చేయడానికి గడువు పొడిగించాలంటూ విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇవాళ ఫిబ్రవరి 17, 2026న విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం గడువు పొడిగింపును నిరాకరించింది. గడువు ఇప్పటికే ముగిసిపోయిన కారణంగా, విశాల్ దాఖలు చేసిన పిటిషన్ అప్రయోజనంగా మారిందని స్పష్టం చేసింది.

కేసు వివరాలు..

సినిమా నిర్మాణం కోసం విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని ఆరోపిస్తూ ‘లైకా ప్రొడక్షన్స్‌’ 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టులో కొనసాగుతోంది. జూన్ 2025లో సింగిల్ జడ్జి, రూ.21.29 కోట్ల రుణంపై 30% వార్షిక వడ్డీతో కలిపి మొత్తం రూ.57 కోట్లు లైకాకు చెల్లించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై స్టే మంజూరు చేయాలని విశాల్ అప్పీల్ దాఖలు చేశారు.

అలాగే, విశాల్ 2025 డిసెంబర్ 18న మరో పిటిషన్ దాఖలు చేసి, డిపాజిట్ చేసేందుకు అదనంగా ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఆ పిటిషన్‌పై కోర్టు లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు జారీ చేసి, విచారణను కొన్ని సార్లు వాయిదా వేసింది. ఈలోపే ఆయన కోరిన గడువు పూర్తిగా ముగిసిపోయింది. గడువు పొడిగింపు తిరస్కరణతో, ముందుగా విధించిన షరతులు అమలులోకి వస్తాయి. దీంతో లైకా ప్రొడక్షన్స్ తమ బకాయిల వసూళ్ల కోసం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశముంది.