రష్యా, ఉక్రెయిన్‌ వార్​లో మరో భారతీయుడు మృతి

రష్యా, ఉక్రెయిన్‌ వార్​లో మరో భారతీయుడు మృతి

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ మరో భారతీయుడు మృతిచెందాడు. హర్యానాకు చెందిన రవి మౌన్ (22) అనే యువకుడు యుద్ధంలో మరణించినట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు రవి మౌన్​సహా ఐదుగురు భారతీయులు మరణించినట్టు స్థానిక మీడియా తెలిపింది. రవి మౌన్​కు ఓ ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ ఏజెంట్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో అతడు ఈ ఏడాది జనవరిలో రష్యాకు వెళ్లినట్టు మృతుడి సోదరుడు అజయ్​తెలిపారు.

 అతడు అక్కడికి వెళ్లిన తర్వాత ఆయుధ శిక్షణ ఇచ్చారని, మార్చిలో ఉక్రెయిన్‌తో సరిహద్దులో జరిగే పోరాటంలో అతన్ని చేర్చారని పేర్కొన్నారు. అతనితో కాంటాక్ట్​ కోల్పోయిన తరువాత తాను మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించానని.. వారు రవి మౌన్​ మరణించినట్టు తమకు తెలిపారని అజయ్ చెప్పారు. రవి ఒకసారి యుద్ధం నుంచి తిరిగి వచ్చినా మళ్లీ పోరాటానికి తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు.  కాగా, తమ సోదరుడి డెడ్​బాడీని భారత్‌కు తీసుకురావడానికి సహకరించాలని కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.