స్టాక్ మార్కెట్లకు ఆంత్రోపిక్ షాక్..రూ.6.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్లకు ఆంత్రోపిక్ షాక్..రూ.6.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

 

  • భారీగా నష్టపోయిన ఐటీ స్టాక్స్​
  • సెన్సెక్స్ 1,068 పాయింట్లు డౌన్​
  • కుప్పకూలిన ఐటీ స్టాక్స్​ 

ఏఐ టెక్ ​కంపెనీ ఆంత్రోపిక్ ​తెచ్చిన ఓ కొత్త టూల్.. మన స్టాక్​ మార్కెట్​ను కుదిపేసింది. ఇండియా ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గత రెండు రోజులుగా కొనసాగిన లాభాలకు బ్రేక్ వేస్తూ సెన్సెక్స్ 1,068, నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.6.5 లక్షల కోట్లు ఆవిరైంది. ఐటీ ఇండెక్స్ ​అధికంగా 4.8 శాతం పడిపోయింది. రియాల్టీ, టెలీకమ్యూనికేషన్స్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఐటీలో ఒత్తిడి వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గుతుందనే అంచనాలతో ఆ సెక్టార్​ షేర్లు కూడా భారీగా పడ్డాయి. ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ టూల్స్ వేల లైన్ల కోడ్‌‌‌‌ను నిమిషాల్లో స్కాన్ చేసి బగ్స్​ను  గుర్తిస్తాయి. దీని వల్ల ఐటీ నిపుణుల అవసరం తగ్గి కంపెనీల సర్వీస్​ అవసరం లేకుండా పోయే ప్రమాదం ఉంది.

ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనల వల్ల సూచీలు ఒక శాతానికిపైగా పడ్డాయి. ఏఐ టెక్​ కంపెనీ ఆంత్రోపిక్​ తెచ్చిన కొత్త టూల్​కారణంగా గ్లోబల్​తోపాటు దేశీయ ఐటీ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. దీంతో కంపెనీల ఆదాయాలు తగ్గే అవకాశం ఉండటమే కారణం. గత రెండు రోజులుగా కొనసాగిన లాభాలకు బ్రేక్ వేస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 1,068 పాయింట్లు పతనమై 82,225 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 1,359 పాయింట్ల మేర పడిపోయి 81,934 కనిష్ట స్థాయికి చేరింది.  
ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,424 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఒక దశలో 385 పాయింట్లు నష్టపోయి 25,327 కనిష్ట స్థాయిని తాకింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.6.5 లక్షల కోట్లు ఆవిరయింది. షేర్ల అమ్మకాల ఒత్తిడితో బీఎస్​ఈ లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా తగ్గింది. టెక్ మహీంద్రా అత్యధికంగా 6.6 శాతం నష్టపోగా, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌‌టెల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ లోని 32 కంపెనీలు నష్టపోగా, 18 కంపెనీలు లాభాల్లో ముగిశాయి.  ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ లాభపడ్డాయి.  

ఐటీ సూచీ ఢమాల్​ 

ఐటీ ఇండెక్స్​ ఏకంగా 4.8 శాతం పడిపోయింది. రియల్టీ, టెలికం రంగాలు కూడా నష్టాలను చవిచూశాయి. ఐటీ రంగంలో ఒత్తిడి వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గుతుందనే అంచనాలతో ఆ రంగ షేర్లు కూడా పడిపోయాయి. మెటల్, ఎనర్జీ, ఎఫ్​ఎంసీజీ, హెల్త్​కేర్ రంగాలు లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ లో మొత్తం 2,802 షేర్లు నష్టపోగా 1,422 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో కొరియా, చైనా, జపాన్ సూచీలు లాభాల్లో ముగిశాయి. యూరప్​ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర  71.66 డాలర్లకు పెరిగింది.  

ఆంత్రోపిక్​ టూల్​తో ఐటీ కంపెనీలకు గండం

ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ టూల్​ అమెరికా ఐటీలో ప్రకంపనలు సృష్టించింది. దీని ప్రభావంతో భారతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. టీఏసీ ఇన్ఫోసెక్ 14.67 శాతం, టెక్ డీ సైబర్ సెక్యూరిటీ 13.34 శాతం మేర నష్టపోయాయి.   రెండు రోజుల్లోనే 52.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది.   క్లాడ్ ఓపస్ 4.6  సాఫ్ట్‌‌వేర్ నిపుణులు కూడా గుర్తించలేని 500కుపైగా లోపాలను పసిగట్టగలుగుతుంది.  ఐటీ కంపెనీలు సాఫ్ట్‌‌వేర్ కోడింగ్‌‌లోని లోపాలను గుర్తించడానికి పెద్ద సంఖ్యలో నిపుణులను నియమిస్తాయి. దీనికోసం క్లయింట్ల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తాయి. ఆంత్రోపిక్​ టూల్​తో వీరి అవసరం తగ్గిపోతుందని, కంపెనీల ఆదాయాలు తగ్గుతాయని భావిస్తున్నారు.