దేశంలో యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీ వచ్చే రోజులు అతిదగ్గర్లోనే ఉన్నాయి. మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా మందులు అమ్మేయడం.. కోళ్ల పెరుగుదల కోసం ఫారాల్లో వాడేయడం.. పాల ఉత్పత్తిలోనూ వాటి వాడకం పెరిగిపోతుండడంతో బ్యాక్టీరియాలు మందులకు లొంగకుండా తయారవుతున్నాయి. ఇదే ప్రమాదమనుకుంటే.. ఇప్పుడు మనుషుల్లోనూ మందులకు లొంగని ఆ మొండి బ్యాక్టీరియాలు చేరిపోతున్నాయి. అవును, హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రి ఏషియన్ఇన్స్టిట్యూట్ఆఫ్గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చేసిన గ్లోబల్ స్టడీలో ఈ విషయం వెల్లడైంది.
మన దేశంలోని 83 శాతం మంది రోగుల్లో మందులకు లొంగని బ్యాక్టీరియా (మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గనిజమ్స్)ను ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు గుర్తించారు. ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ (ఈఆర్సీపీ– లివర్, పాంక్రియాటిక్ జబ్బులతో బాధపడే) రోగుల్లో ఈ మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా.. మన దేశంలోనే అలాంటి బ్యాక్టీరియాల బారిన పడినోళ్లు ఎక్కువున్నట్టు ఏఐజీ స్టడీ హెచ్చరించింది.
ఏఐజీ స్టడీలో భాగంగా ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్‌కు చెందిన వారి శాంపిళ్లనూ పరీక్షించారు. ఇందులో మన దేశ రోగుల్లో 83 శాతం మందిలో మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ఆ తర్వాత ఇటలీకి చెందిన 31.5 శాతం మంది, అమెరికాకు చెందిన 20.1 శాతం మందిలో వాటి ప్రభావం ఉన్నట్టు తేల్చారు. అత్యల్పంగా నెదర్లాండ్స్‌లో 10 శాతం మందిపైనే ఆ మొండి బ్యాక్టీరియా ప్రభావం ఉందని గుర్తించారు.
హై పవర్ మందులు వాడినా లొంగట్లేదు..
ఎన్ని యాంటీ బయాటిక్‌లు వాడినా ప్రయోజనం లేదనుకున్న సందర్భంలో.. చివరి అస్త్రంగా హైపవర్ లేటెస్ట్ యాంటీ బయాటిక్స్ వాడినా కొన్ని బ్యాక్టీరియాలు లొంగడం లేదని స్టడీలో తేల్చారు. అలాంటి రకాలే ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా న్యుమోనియా, కార్బాపీనమ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని నిర్ధారించారు.
70 శాతం మందిలో ఈ ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లుండగా.. మరో 28 శాతం మందిలో కార్బాపీనమ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉందని గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి హైఎండ్ యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగడం లేదని, వాటిని ట్రీట్ చేయడం కష్టతరమవుతుందని, పేషెంట్ కోలుకోవడానికీ ఎక్కువ సమయం పడుతుందని, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
