- గోదావరి నుంచి వృథాగా పోయే
- 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా ప్రాజెక్టు కడుతున్నం
- నేరడి బ్యారేజ్ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్తం
- 2027 గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తయ్యేలా సహకారం అందించండి
- సుప్రీం తుది తీర్పు వచ్చేంత వరకూ ఆల్మట్టి ఎత్తు పెంపుపై గెజిట్ ఇవ్వొద్దని రిక్వెస్ట్
న్యూఢిల్లీ, వెలుగు: వరద జలాలను వినియోగించే పేరుతో ఏపీ నిర్మిస్తున్న పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కోరారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల వరద జలాలలను మళ్లించేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు వరుసగా భేటీ అయ్యారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకెళ్తామని తెలిపారు.
ఏపీ నీటి అవసరాలకు తగ్గట్టుగా 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణం చేపడతామని చెప్పారు. దీనికి అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాలని కోరినట్టు తెలిసింది. అలాగే, 2027 గోదావరి పుష్కరాల్లోపు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని రిక్వెస్ట్ చేశారు. వీటితోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని విన్నవించారు.
తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే తాను స్వయంగా 5 సార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు వెల్లడించారు. గత ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
- సుప్రీంకోర్టు తుది తర్వాతే గెజిట్ ఇవ్వండి..
సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆల్మట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచితే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, అందువల్ల ఎలాంటి సాంకేతిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయొద్దన్నారు.
'అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-3 కింద భూసేకరణ, ఇతర సన్నాహక పనులు చేయకుండా కర్నాటకను ఆదేశించాలని, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని కోరినట్టు సమాచారం. అంతకుముందు సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సీఎం.. సంక్షోభం నుంచి వచ్చిన సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని సూచించారు.
- ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందనే కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు వివరించారు.
ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర, ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. కాలువల సామర్థ్యం పెంచిన మేరకు నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలన్నారు.
