- రైసినా డైలాగ్’ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ, వెలుగు: గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను.. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు 'పాపులేషన్ మేనేజ్‌మెంట్'గురించి మాట్లాడుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో జరిగిన 'రైసినా డైలాగ్' సదస్సులో పాల్గొని, మాట్లాడారు. ‘‘30 ఏండ్ల క్రితం ఒక ప్రజాప్రతినిధిగా నేను జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను.
కానీ, ఇప్పుడు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించి 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ'ని ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు1.5 శాతానికి పడిపోయింది. దీనిని 2.1 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది.గతంలో మన దేశంలో పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండేవి. ఇప్పుడవి మైక్రో ఫ్యామిలీలుగా మారిపోయాయి. అందుకే ఏపీలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని పిలుపునిస్తున్నాను.
మూడో బిడ్డ పుడితే రూ. 25 వేల ఆర్థిక సాయం..అలాగే, నెలకు రూ. 1,000 చొప్పున ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించాం. చైల్డ్ కేర్ లీవ్ లాంటి ప్రోత్సాహకాలను అందించాలని కూడా ఆలోచన చేస్తున్నాం.వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏజింగ్ సమస్యను ఎదుర్కోవడానికి జనాభా నిర్వహణ చాలా కీలకం’’ అని పేర్కొన్నారు.
సహకార ఫెడరలిజంతో ముందుకు
సహకార ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏఐ , క్వాంటం అల్గారిథమ్స్ వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటీవల ట్రైనింగ్ కోసం కోసం పిలుపునిస్తే 50 వేల మంది జాయిన్ అయ్యారన్నారు. మేధావుల ఆలోచనలను అమలు చేసేందుకు ఏపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.‘
‘ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నత స్థానాల్లో ఉండడానికి 30 ఏండ్ల క్రితం మేం తీసుకున్న సంస్కరణలే కారణం. నాలెడ్జ్ ఎకానమీతో ప్రపంచానికి నైపుణ్యాలను అందిస్తున్నాం”అని పేర్కొన్నారు. ఈ సదస్సుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, 110 దేశాల నుంచి 2,700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు హాజరయ్యారు
