వ్యూహమా? రాజకీయమా?..వైఎస్ జగన్.. కేసీఆర్ పరామర్శ వెనుక మతలబేంటి?

వ్యూహమా? రాజకీయమా?..వైఎస్ జగన్.. కేసీఆర్ పరామర్శ వెనుక మతలబేంటి?
  • కేసీఆర్ పరామర్శ వెనుక మతలబేంటి?
  • షర్మిల కాంగ్రెస్ లో చేరిన రోజే ఎందుకు? 
  • 40 నిమిషాల పాటు ఏకాంతంగా ఏం మాట్లాడారు
  • ఏపీ ఎన్నికల వేళ జగన్ ఎందుకొచ్చినట్టు?
  • చంద్రశేఖర్ రావు సలహాలు కోరుతున్నారా?
  • ఏపీలో బీఆర్ఎస్ సహకారం అడగుతున్నారా!

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్ర షర్మిల ఇవాళ ఉదయం కాంగ్రెస్ లో చేరారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని తన తండ్రి దివంగత వైఎస్సార్ కలలు కన్నారని, అందుకోసమే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. ఇందుకోసం ఏపీ కాదు అండమాన్ లో బాధ్యతలు ఇచ్చినా పనిచేస్తానని చెప్పడం గమనార్హం.

సరిగ్గా ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వచ్చారు. తుంటి ఎముక మార్పిడి చేయించుకున్న కేసీఆర్ ను పరామర్శించారు. ఈ రెండు పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ డిసెంబర్ 8న శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు అనేక మంది రాజకీయ  ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించారు.

దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు నేతలు ఏకాంతంగా మాట్లాడారు. వీరిద్దరూ ఏం మాట్లాడరన్నది చర్చనీయాంశంగా మారింది.  ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్ ను పరామర్శించేందుకు జగన్ రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  షర్మిల పార్టీ మెర్జర్ ఇష్యూనూ డైవర్ట్ చేయడంలో భాగంగానే జగన్ కేసీఆర్ ను పరామర్శించారని తెలుస్తోంది.

అపారమైన రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ తో భేటీ అయిన జగన్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సలహాలు కోరారా..? అన్న చర్చ ఓవైపు నడుస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఆంధ్రాప్రాంత వాసులు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు. దీంతో హైదరాబాద్ పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.

ఈ నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ సహకారం అడుగుతున్నారా..? అన్న చర్చ కూడా ఉంది. అయితే ఇవాళ షర్మిలతో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకొన్న వాళ్లలో ఏపీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దివంగత సీఎం వైఎస్సార్ కుమారుడు ఏపీ సీఎం జగన్, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇవాళ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.