నల్లమల సాగర్ పై ఇప్పుడు చర్చ అనవసరం : ఏపీ

నల్లమల సాగర్ పై ఇప్పుడు చర్చ అనవసరం :  ఏపీ
  • అదింకా ప్రతిపాదనల దశలోనే ఉంది.. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
  • నర్మదా, కావేరి ట్రిబ్యునళ్లు ఔట్​సైడ్ బేసిన్​కు నీళ్లు కేటాయించినయ్ 
  • కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు కేంద్రం నదుల అనుసంధానం చేస్తున్నది
  • రాయలసీమకు నీటిని తరలించడం అనివార్యమని వాదన 

హైదరాబాద్, వెలుగు: పెన్నా బేసిన్​కు నీటిని తీసుకెళ్లాలంటే పోలవరం ఆధారంగా చేపట్టాలనుకుంటున్న పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్ట్ అనివార్యమని, మరో ప్రత్యామ్నాయం లేదని ఏపీ తేల్చి చెప్పింది. అయితే, ప్రస్తుతం ఆ ప్రాజెక్టే లేదని, అక్కడి నుంచి నీళ్లు కూడా తీసుకెళ్లడం లేదని, సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్​కు కూడా అనుమతి ఇంకా రాలేదని తెలిపింది. కేవలం ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని.. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు దీనిపై చర్చించాల్సిన  అవసరం లేదని పేర్కొంది.

బుధవారం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (బ్రజేశ్ ట్రిబ్యునల్) ముందు ఏపీ తన వాదనలను పున:ప్రారంభించింది. ఏపీ తరఫున సీనియర్ అడ్వొకేట్ జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు. కృష్ణా నుంచి ఔట్​సైడ్​ బేసిన్​కు నీటిని తరలించొద్దంటూ తెలంగాణ వాదిస్తున్నదని, అయితే, నర్మదా, కావేరి నదుల విషయంలో ఔట్​సైడ్ బేసిన్​కు నీటిని తరలిస్తున్నారని వివరించారు. అసలు నదీ ప్రవాహమే లేని ప్రాంతాలకూ నర్మదా కేటాయింపులు ఇచ్చారన్నారు. గ్రాండ్ ఆనకట్ట కింద 45 వేల ఎకరాలు ఔట్​సైడ్ బేసిన్​లోనే ఉన్నా.. కావేరి ట్రిబ్యునల్ నీటిని కేటాయించిందని తెలిపారు.

దీనికి కర్నాటక అభ్యంతరం చెప్పినా కావేరి ట్రిబ్యునల్ తిరస్కరించిందని గుర్తు చేశారు. బెంగళూరు సిటీ ఔట్​సైడ్​ బేసిన్​లో ఉందన్న కారణంతో కావేరి ట్రిబ్యునల్ నీటిని కేటాయించలేదని, కానీ, ఆ తర్వాత సుప్రీంకోర్టు తాగునీటి కోసం నీటిని ఇవ్వొచ్చని స్పష్టం చేసిందని తెలిపారు. కరువు ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని వాదించారు. డెల్టా ప్రాంతం బేసిన్​కు అవతలే ఉన్నా.. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు చేసిందన్నారు. హెల్సింకీ  రూల్స్​గానీ.. బెర్లిన్ రూల్స్​గానీ ఔట్​సైడ్ బేసిన్ కు నీటి కేటాయింపులను నివారించలేవన్నారు. 

నదుల అనుసంధానం చేస్తున్నరు కదా..

దేశంలోని పలు ప్రాంతాలు కరువు గుప్పిట్లో ఉంటే.. మరికొన్ని ప్రాంతాలు మాత్రం నీటితో కళకళలాడుతున్నాయని ఏపీ వాదించింది. ఈ క్రమంలోనే కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపట్టింది కదా.. అని ప్రశ్నించింది. పెన్నా బేసిన్​లో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుందని.. జాతీయ దృక్పథంతో నీటి కేటాయింపులను చేపట్టాలని నేషనల్ వాటర్ పాలసీ 2002 కూడా స్పష్టం చేసిందని పేర్కొంది. అందుకే కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపట్టిందని తెలిపింది.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఔట్​సైడ్​ బేసిన్​కు నీటి తరలింపులు అనివార్యమని వాదించింది. అలాగే కృష్ణా నుంచి తమకు సహజంగానే గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తాయని, ఎత్తు మీదున్న తెలంగాణకు లిఫ్ట్​లు తప్పనిసరి అని తెలిపింది. ఏపీలో ఔట్​సైడ్​బేసిన్​కు నీటిని తరలించడం వల్ల అక్కడి ప్రజల స్థితిగతులు మెరుగయ్యాయని తెలిపింది. గోదావరి, కృష్ణా ట్రిబ్యునళ్లలో తెలంగాణ ఎప్పుడూ ఓ పార్టీగా లేదని.. కానీ, అవార్డ్స్ మాత్రం తెలంగాణకూ వర్తిస్తాయని పేర్కొంది.