జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ

రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని పేదలకు ఇచ్చేందుకు 268 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపడం చర్చనీయాంశమైంది. రాజధాని గ్రామాలైన బోరుపాలెం, నెక్కళ్లు, దొండపాడుతో పాటు మరికొన్ని గ్రామాల్లో  స్థలాలను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం ఎలా భూములను పంచుతుందని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని భూములను పంచుకుంటూ పోతే కీలక నిర్మాణాలకు భూమి ఎలా మిగులుతుందని వారు నిలదీస్తున్నారు.

అమరావతిలో ఆర్-5 జోన్ లో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు స్థలాలు కేటాయించాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు సీఆర్డీఏ కమిషనర్కు లేఖలు రాశారు. కలెక్టర్లు అడిగిన 1134.58 ఎకరాల భూమి కంటే అదనంగా మరికొంత భూమి కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఎస్3 జోన్లో అదనంగా 268 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ ఓలేఖ ద్వారా బదులిచ్చారు. గుంటూరు జిల్లాలో 23,235 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 26,739 మంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు. కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఫొటోలు సేకరించే ప్రక్రియను ప్రారంభించారు. బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన ఎస్‌-3 జోన్‌లో ఎకరం ధర రూ.4.1 కోట్లని ఈ ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీన జరిగిన 33వ సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు అందులో 6 శాతం ధరకే అంటే.. ఎకరా రూ.24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.

ప్రతిపాదనలు సిద్దం

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం తీసుకుంటున్నందున మౌలిక ధరలో ఆరు శాతానికే విక్రయించడానికి నిర్ణయించినట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి 168 ఎకరాలకు ప్రతిపాదన రాగా... బోరుపాలెంలో 2.05 ఎకరాలు, పిచ్చుకల పాలెంలో 20.47 ఎకరాలు, పిచ్చుకలపాలెంలోనే మరో 81.09 ఎకరాలు, అనంతవరం లో 64.39 ఎకరాలు కేటాయించారు. అలాగే గుంటూరు జిల్లా పరిధిలో నిర్దేశించిన వంద ఎకరాలను నెక్కల్లు గ్రామంలో కేటాయించింది. ఎన్టీఆర్‌ జిల్లాకు నిర్దేశించిన 168 ఎకరాలకు రూ.41.33 కోట్లు, గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 100 ఎకరాలకు రూ. 24.60 కోట్లు... మొత్తంగా 268 ఎకరాలకు రూ.65.93 కోట్లుగా సీఆర్‌డీఏ తేల్చింది.