గుట్టుచప్పుడు కాకుండా ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు

గుట్టుచప్పుడు కాకుండా ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు


అయిజ, వెలుగు: ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) రైట్ కెనాల్ నిర్మాణాన్ని ఏపీ సర్కారు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. పోలీస్ పహారా మధ్య పనులు చేస్తోంది. రైట్ కెనాల్ వైపు ఎవరినీ రానీయడం లేదు. పనులు జరుగుతున్న ప్రాంతం దగ్గరికి మీడియాను అనుమతించడం లేదు. ఏపీకి రైట్ కెనాల్ తవ్వడానికి ఎలాంటి అనుమతులు లేవని, పనులు వెంటనే ఆపాలని రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. 

40 టీఎంసీలు తరలించేలా కుట్ర 

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సాకు చెప్పి ఆర్డీఎస్ నుంచి 4 టీఎంసీల నీటి తరలింపు కోసం రైట్ కెనాల్ నిర్మించేందుకు ఏపీ ప్లాన్ చేసింది. తర్వాత ఏకంగా 40 టీఎంసీల నీటిని తరలించేందుకు కుట్ర పన్నింది. ఇందులో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం అగసనూరు వద్ద  రైట్ కెనాల్ పనులను 4 నెలల క్రితం ప్రారంభించింది. ఆనకట్ట కంటే 10 అడుగుల దిగువన కాలువను ఏర్పాటు చేసుకుని,160 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. 4 నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తోంది. అనుమతులు లేని పనులను ఆపాలంటూ రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఏపీ ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనుల వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేసుకుంది. కర్నూల్ ఎస్పీ పక్కీరప్ప పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనుల దగ్గరికి మీడియాను అనుమతించడం లేదు. 

గద్వాల జిల్లా ఆయకట్టుకు ముప్పు

ఏపీ నిర్మిస్తున్న ఆర్డీఎస్ రైట్ కెనాల్ వల్ల గద్వాల జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. లెఫ్ట్ కెనాల్ కు పూర్తిస్థాయి లో నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్డీఎస్ నీటి మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు రైట్ కెనాల్ వల్ల దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆర్డీఎస్ లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న రాజోలి, వడ్డేపల్లి, మానవపాడు, అలంపూర్ మండలాలకు సాగునీరు ప్రశ్నార్థకమవుతోంది. మరోవైపు ఆర్డీఎస్ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన స్లూయీస్ లు మూసి వేయాలని చాలా కాలంగా అలంపూర్ రైతులు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో వరద నీటితో పాటు మన వాటా నీళ్లు కూడా ఏపీ వైపు వెళ్లిపోతున్నాయి.

వచ్చే అరకొర నీళ్లు కూడా రావు

అయిజ మండలంలోని 6 గ్రామాల్లో 7,812 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏపీ రైట్ కెనాల్ నిర్మిస్తే ఇప్పుడొస్తున్న అరకొర నీళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా కుటక్కనూర్ వద్ద తుంగభద్ర నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. గట్టు మండల పరిధిలోని చిన్నోనిపల్లి దగ్గర్లో రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసి, నెట్టెంపాడు నీటి తో రిజర్వాయర్ ను నింపి ప్రత్యేక ఫీడర్ చానల్ ఏర్పాటు చేసి ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్ 12 వద్ద లింక్ చేయాలి.
‑ రైతు సంఘం నాయకుడు మేకల నాగిరెడ్డి