ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి వివాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్(ఎస్‌ఈసీ) ఈ-వాచ్ యాప్ రూపొందించింది. ఈ యాప్‌పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధ‌వారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.

ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. పంచాయతీరాజ్‌శాఖ యాప్ ఉండగా ఈ-వాచ్‌ యాప్‌ ఎందుకని ఏపీ ప్ర‌భుత్వం ప్రశ్నించింది. భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్‌ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని పార్టీలకు లబ్ది చేకూర్చేలా యాప్‌ ఉందన్న ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.