ముంబై నటి కాదంబరి జేత్వానీ కేసు ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జేత్వానీ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. దీనితో పాటు ఏపీలో పలు కీలక కేసులను సీఐడీకి బదిలీ చేశారు పోలీసులు.చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులను కూడా సీఐడీకి బదిలీ చేసింది ప్రభుత్వం. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే 110 మందికి పైగా కేసులు, 30 మందికి పైగా అరెస్టు చేసిన పోలీసులు...నేడు ( అక్టోబర్ 14, 2024 ) కేసుకు సంబంధించిన ఫైళ్లు సీఐడీకి అప్పగించనున్నారు.
జేత్వానీ కేసు విషయంలో వైసీపీ హాయంలో అప్పటి సీఎంఓ, డీజీపీ ఆఫీస్ తో పాటు విజయవాడ లో పని చేసిన కీలక పోలీస్ ఆఫీసర్లపై అభియోగాలున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణ కొనసాగుతుండగా... పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇందులో వైసీపీ నేత విద్యా సాగర్ ను పోలీసులు విచారించారు.
జేత్వాన్నీ కేసుతో సహా టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకే ప్రభుత్వం సీఐడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న వారికి ఉచ్చు బిగుసుకుంటోందనే చెప్పాలి. ఇప్పటికే ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న నేతలను పోలీసులు విచారించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన అభియోగాలున్నాయి. మిగిలిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోగా.. వారి విచారణకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తానికి ఏపీలో కలకలం రేపిన జేత్వానీ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.