ఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు బృందంతో సమగ్ర విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు. సిట్తో దర్యాప్తు తమకు కూడా సమ్మతమేనని తెలిపారు. ఈ దర్యాప్తు బృందంలో ఎవరిని తీసుకోవాలనే అంశంలో కూడా కోర్టు ఎవరైనా అధికారిని సూచించినా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటయ్యే స్వతంత్ర దర్యాప్తు బృందం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై నిజానిజాలను త్వరలోనే నిగ్గు తేల్చనుంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు శుక్రవారం (అక్టోబర్ 04, 2024) విచారణ జరిపింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణ మొదలైంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్లపై వాదప్రతివాదనలు విన్నారు. వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ దర్యాప్తు బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఏపీ పోలీస్ శాఖ నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని సూచించింది.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు
కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయం కావడంతో స్వతంత్ర దర్యాప్తు బృందంతో (SIT) సమగ్ర విచారణకు ఆదేశించినట్లు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ తెలిపింది. ఈ బృందంలో భాగమయ్యే ఇద్దరు సీబీఐ అధికారులను సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్ దర్యాప్తు మొత్తం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు పొలిటికల్ డ్రామాకు దారితీయాలని తాము భావించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. స్వతంత్ర దర్యాప్తు బృందంతో సమగ్ర విచారణ జరిగితే భక్తులకు కూడా దర్యాప్తు పట్ల నమ్మకం ఏర్పడుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.