ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయం ఇన్నాళ్లకు యాదికొచ్చిందా?

ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయం ఇన్నాళ్లకు యాదికొచ్చిందా?
  • ఏపీ ప్రాజెక్టులపై రెండేండ్లకు స్పందించిన కేసీఆర్​
  • కేంద్రం జోక్యం అక్కర్లేదని అప్పట్లో కామెంట్లు..  ఇప్పుడు సడెన్​గా యూటర్న్​
  • తప్పంతా ఏపీది, కేంద్రానిదేనంటూ విమర్శలు
  • ఏపీ నీళ్ల దోపిడీపై వరుసగా కథనాలు ప్రచురించిన ‘వెలుగు’  

హైదరాబాద్‌, వెలుగు: కృష్ణా నీళ్లను దోచుకునేందుకు రెండేండ్ల నుంచి ఏపీ సర్కారు ప్రాజెక్టులు కడుతుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్ ఇప్పుడు  స్పందించారు. ఏపీ దాదాగిరి చేస్తోందని, కృష్ణా నీళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఇంతకాలం సైలెంట్​గా ఉన్న  కేసీఆర్  ఇప్పుడు చేసిన కామెంట్లు చూస్తే తన తప్పేమీ లేదని,  కృష్ణా జలాల ఇష్యూను ఇతరులపైకి నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ను ఎండబెట్టేందుకు సంగమేశ్వరం నుంచి రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను ఏపీ మొదలు పెడుతోందని, ఏపీ కడుతున్న ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ‘వెలుగు’ దినపత్రిక మొదటి నుంచి వరుస కథనాలు ప్రచురించింది. సంగమేశ్వరం ప్రాజెక్టు పనుల ఫొటోలను బయటపెట్టి, ఏపీ కుట్రలను ఎండగట్టింది. అయినా ఏనాడూ  కేసీఆర్‌ పెదవి విప్పలేదు. ఏపీ కడుతున్న ప్రాజెక్టుల టెండర్లు ముగిసి,  పనులు మొదలయ్యేంత వరకు మౌనంగా ఉన్న కేసీఆర్.. ఇప్పుడే ఈ విషయం తెలిసినట్లుగా స్పందించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీని డబుల్ చేస్తామని, సంగమేశ్వరం కడుతామని ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం జగన్‌  ప్రకటించినప్పుడు కూడా కేసీఆర్ మాట్లాడలేదు. 

నీళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కాదు, ట్రిబ్యునళ్ల జోక్యం కూడా అక్కర్లేదని అప్పట్లో చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్‌ కావాలని పట్టుబడుతున్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మీడియా ప్రశ్నలు వేస్తే ‘కేసీఆర్‌కేనా నీళ్ల గురించి చెప్పేది’ అంటూ మాట్లాడిన ఆయన ప్రస్తుతం నెపం కేంద్రంపైకి నెట్టేయాలని చూస్తున్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చర్చించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌  మీటింగ్​ నిర్వహిస్తామని కేంద్రం ఏడాదిన్నర కిందటే ముందుకు వచ్చింది. అప్పుడు అపెక్స్  కౌన్సిల్​ మీటింగ్​కు వెళ్లేందుకు కేసీఆర్ ససేమిరా అన్నారు. నీళ్ల పంపకాల్లో కేంద్రం జోక్యమే అవసరం లేదని, ఇద్దరు సీఎంలం కలిసి కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. వైఎస్​ జగన్‌ ప్రమాణస్వీకారానికి హాజరైనప్పుడే నీళ్ల విషయంలో కలిసి పనిచేద్దామని ఆయనతో కేసీఆర్‌ చెప్పారు. 2019 జూన్‌ 18న రెండు రాష్ట్రాల సీఎంలు ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. గోదావరి –- కృష్ణా నదుల అనుసంధానంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పందిస్తూ ‘‘బేసిన్‌లు లేవ్‌.. భేషజాల్లేవ్.. రెండు రాష్ట్రాల నీళ్లపై కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. అదే ఏడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీంకు ప్రైమరీ సర్వే మొదలు పెట్టింది. అప్పుడే ‘వెలుగు’ ఏపీ అక్రమ ప్రాజెక్టులను  చేపట్టబోతోందని హెచ్చరించింది. 2020 మే 5న ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌ ప్రాజెక్టులకు రూ. 6,820 కోట్లు కేటాయిస్తూ అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌  ఇచ్చింది. ఆ రోజు నుంచి ‘వెలుగు’ ఏపీ అక్రమ ప్రాజెక్టులపై వరుస స్టోరీలు ప్రచురించింది. వీటి ఆధారంగా నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌ నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ను ఆశ్రయించడంతో ఏపీ అక్రమ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం టెండర్ల ప్రక్రియలో వేగం పెంచినా కేసీఆర్‌ అపెక్స్‌ కౌన్సిల్‌కు హాజరుకాలేదు. గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీ పిటిషన్‌పై తీర్పు రావాల్సిన రోజే  కేసీఆర్‌ సర్కారు స్పందించి రీ ఓపెన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సంగమేశ్వరం ఎత్తిపోతలకు పర్యావరణం సహా అన్ని అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి ఏపీ సర్కారు ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టింది. ఇదే విషయాన్ని ఫొటోలతో సహా ‘వెలుగు’ 2020 డిసెంబర్‌ 13న ప్రముఖంగా ప్రచురించింది. దీని ఆధారంగా ఎన్జీటీలో రైతు గవినోళ్ల శ్రీనివాస్​ ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయగా.. సర్వే మాత్రమే చేస్తున్నామని అప్పటి ఏపీ స్పెషల్‌ సీఎస్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఏపీ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టిన ఆరు నెలల తర్వాత మన సర్కారు స్పందించి వరుసగా మంత్రులతో ప్రెస్‌మీట్‌లు పెట్టించింది. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ నోరు విప్పారు.