ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక బైపీసీ స్టూడెంట్ బోటనీ పరీక్షలో తప్పింది. కేవలం 5 మార్కులు తక్కువ రావటంతో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యింది. సరేలే తక్కువ మార్కులేగా తేడా ఉంది పాస్ కావటానికి అని సదరు విద్యార్థిని రీ వాల్యువేషన్ కోసం అప్లై చేసుకుంది. అయితే వచ్చిన ఫలితాలు చూసి ఆమెనే షాక్ అయ్యింది. ఈ విషయం బయటకు రావటంతో మూల్యాంకనం ప్రక్రియపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిలువూరుకు చెందిన బైపీసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కర్లపూడి కావ్య విషయంలోనే ఇది జరిగింది. ఏప్రిల్ 15న వచ్చిన ఫలితాల్లో జస్ట్ 5 మార్పులతో బోటనీలో ఫెయిల్ అవ్వగా మిగిలిన సబ్జెక్ట్స్ సూపర్ మార్క్స్ వచ్చాయి ఆమెకు. దీంతో తాను పరీక్ష మంచిగానే రాసినా ఎందుకిలా జరిగిందనేది ఆమెకు అర్థం కాలేదు. దీంతో రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసి చూద్దాం అనుకుంది కావ్య.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈసారి ఫలితాల్లో ఆమెకు బోటనీలో 60కి 60 మార్కులు రావటంతో కావ్యతో పాటు ఆమె కుటుంబం కూడా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎందుకంటే అదే ఆన్సర్ పేపర్ ఇంతకు ముందు ఆమెను ఫెయిల్ చేయటం ఆ తర్వాత ఫుల్ మార్క్స్ రావటం వైరల్ గా మారింది. అసలు ఇంటర్ బోర్డు నుంచి ఆన్సర్ షీట్ తో పాటు రీవాల్యుయేషన్ వివరాలు చూడగా అసలు మ్యాటర్ తెలిసింది. మార్కులు బబ్లింగ్ లేదా కంప్యూటర్లో ఎక్కించే సమయంలోనే తప్పు జరిగిందని అర్థం అయ్యింది. ఇంటర్ బోర్డ్ ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేస్తే స్టూడెంట్స్ లైఫ్ ఏం కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
