- ఇన్నాళ్లూ కుడివైపును దౌర్జన్యంగా ఆక్రమించుకొని గేట్ల ఆపరేషన్
- తీరా ఇప్పుడు తమవైపు రిపేర్లు కూడా తెలంగాణే చేయాలనే వాదన
- ఈ విషయంలో డ్యామ్ ఓనర్ తెలంగాణ అని గుర్తుచేస్తున్న పొరుగు రాష్ట్రం
హైదరాబాద్, వెలుగు: సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ డబుల్ గేమ్ ఆడుతున్నది. గతంలో బలగాలతో వచ్చి కుడివైపు భాగాన్ని ఆక్రమించేసిన పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు అక్కడ రిపేర్లు మాత్రం తెలంగాణ ప్రభుత్వమే చేయాలని వాదిస్తున్నది. ఇదేమంటే డ్యామ్ ఓనర్ తెలంగాణే కాబట్టి రిపేర్ల బాధ్యత కూడా తెలంగాణదే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. కాగా, ఆపరేషన్ ప్రొటోకాల్స్‌కు విరుద్ధంగా కుడి కాల్వ గేట్లను ఇష్టమొచ్చినట్టు ఆపరేట్‌చేయడం వల్లే అవి దెబ్బతిన్నాయని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. వాటికి రబ్బర్ సీల్స్ వేయడం, గ్రీజింగ్ వంటి పనులను చేయాల్సి ఉందని చెప్తున్నారు. వాస్తవానికి కుడివైపు కాల్వ గేట్లకు రిపేర్లు చేయకపోతే నష్టం తెలంగాణకే! దీంతో వెంటనే రిపేర్లు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులు కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పారు. 21వ బోర్డు మీటింగ్‌కు సంబంధించి ఇటీవల పంపించిన ఎజెండాలోనూ ఏపీ వైపు గేట్ల రిపేర్ల అంశంతో పాటు సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాలు దెబ్బతిన్న విషయాన్ని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు.
వీటికి మరమ్మతులతోపాటు పిడుగుల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థలు, సర్జ్ ప్రొటెక్షన్ డివైజెస్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు ఏపీ అంగీకరిస్తూనే.. తాము పెట్టిన షరతులకు తెలంగాణ ఒప్పుకోవాలంటూ మెలిక పెట్టింది. ఏపీ అవసరాలకు తగినట్టుగానే వాటిని ఏర్పాటు చేయాలని వాదిస్తున్నది. తెలంగాణ అధికారులు మాత్రం.. ఇప్పటికే తాము గతంలో ఏపీ వైపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని ఏపీ వాళ్లే ఖరాబ్ చేసి ఇప్పుడు మళ్లీ తమను పెట్టమనడం బాగా లేదని వాపోతున్నారు. డ్యామ్ ఓనర్ తెలంగాణే అని ఏపీ ఒప్పుకుంటున్నందున ముందు డ్యామ్మొత్తాన్ని తెలంగాణ చేతికి అప్పగించాలని డిమాండ్చేస్తున్నారు. బోర్డు మీటింగ్‌లో దీనిపై గట్టిగా నిలదీసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి వాటర్ ఇయర్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇలాంటి సమయంలో అసలు బోర్డు మీటింగ్ పెట్టాల్సిన అవసరమే లేదన్న వాదన వినిపిస్తున్నది. అవసరమైన సమయంలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఇప్పుడు పెడితే ఏమొస్తుందని అధికారవర్గాలు అంటున్నాయి. కాగా, సాగర్‌లో కుడివైపు రిపేర్ల కోసమే ఏపీ కృష్ణా బోర్డు మీటింగ్‌కు ఒత్తిడి చేస్తున్నదనే చర్చ నడుస్తున్నది.
వాటర్ లెవెల్ రికార్డర్ పెట్టాలె
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద వాటర్ లెవెల్‌ను రికార్డ్ చేసే పరికరాలనూ ఏర్పాటు చేయాలని ఏపీ డిమాండ్ చేస్తున్నది. ఆటోమేటెడ్ వాటర్ లెవెల్ రికార్డర్స్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నది. సాగర్ కామన్ రిజర్వాయర్ కాబట్టి.. అక్కడ ఏడబ్ల్యూఎల్ఆర్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిరుడు డిసెంబర్లోనే బోర్డు చైర్మన్‌కు లేఖ రాసినట్టు ఏపీ చెబుతున్నది. ఇది అత్యంత కీలకమని, కాబట్టి దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలని మార్చిలో మరోసారి లేఖ రాశామని పేర్కొంది. కాగా, మార్చి 20న దాని ఏర్పాటుకు సంబంధించి రెండు రాష్ట్రాలకూ లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపై బోర్డు మీటింగ్‌లో చర్చించే అవకాశం ఉంది.
