ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్ ఇదే ఇప్పుడు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఆధ్వర్యంలో జరిగిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని, రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడిన నారా లోకేష్. . యువగళం పాదయాత్రే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణ అని అన్నారు. యువగళం పాదయాత్రలో పెనుగొండ వద్ద కలిసిన పద్మావతి అనే మహిళా కార్మికురాలి కథ తనను ఆలోచింపజేసిందని ఆయన తెలిపారు. ఒక సామాన్య గృహిణి, పరిశ్రమల రాకతో నెలకు 30 వేల రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదగడం చూశాక.. ఉద్యోగ కల్పన ఎంత ముఖ్యమో తనకు అర్థమైందని, అదే తన లక్ష్యంగా మారిందని లోకేష్ తెలిపారు.
గత 23 నెలల్లో ఏపీ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని లోకేష్ వివరించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థల నుంచి 23 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్లనే, రాయలసీమకు 'క్యారియర్' వంటి అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయని.. దీన్నే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారని ఆయన విశ్లేషించారు.
అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని.. రాయలసీమలో ఆటోమొబైల్, ఉత్తరాంధ్రలో ఐటీ - ఫార్మా, అమరావతిలో క్వాంటం టెక్నాలజీపై దృష్టి సారించామని వెల్లడించారు. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
చివరగా పారిశ్రామికవేత్తలకు ఒకటే భరోసా ఇచ్చారు లోకేష్.. మీకు ఏ కష్టం వచ్చినా నేను ఒక మెసేజ్ దూరంలో ఉంటాను. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 ఏపీ కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలని లక్ష్యంగా విధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న కంపెనీలు ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
