
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తిపై ఏపీ మళ్లీ పాత పాటే పాడింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఉమ్మడి ఏపీలో జారీ చేసిన జీవోల ప్రకారమే కరెంట్ ఉత్పత్తి చేయాలని పట్టుబట్టింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో కరెంట్ ఉత్పత్తి బచావత్ ట్రిబ్యునల్ గైడ్‌లైన్స్ మేరకే చేపట్టాలని కోరుతూనే ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలకు లోబడాలని డిమాండ్ చేసింది. శుక్రవారం జలసౌధలో కేఆర్‌ఎంబీ రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ డుమ్మా కొట్టగా ఏపీ అధికారులు హాజరయ్యారు. వానాకాలం పంట సీజన్‌కు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందని, సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కరెంట్ ఉత్పత్తి, రెండు రిజర్వాయర్ల ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారించడానికి ఎక్కువ సమయం లేనందున మీటింగ్‌ను వాయిదా వేయలేమని కృష్ణా బోర్డు సూచించింది. అయినా తెలంగాణ సమావేశానికి గైర్హాజరైంది.ఈ భేటీలో కరెంట్ ఉత్పత్తికి మార్గదర్శకాలు రూపొందించడం, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ణయించడంపై చర్చించారు. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్స్ (ఆపరేషన్ ప్రొటోకాల్)లో తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి విషయంలోని మార్గదర్శకాలపై సీడబ్ల్యూసీ ఇంజనీర్లను సమావేశానికి ఆహ్వానిస్తే తమ అభ్యంతరాలను వారికి వివరిస్తామన్నారు. పది రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందన పవర్ జనరేషన్‌పై త్వరగా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్‌లో కరెంట్ ఉత్పత్తికి సూచించిన రూల్సే పాటించాలని బోర్డు మెంబర్ మౌన్‌తంగ్ సూచించారు. బచావత్ సిఫార్సులు, ఉమ్మడి ఏపీలో జారీ చేసిన జీవోలకు లోబడే కరెంట్ ఉత్పత్తి చేసేలా రూల్స్ రూపొందించాలని ఏపీ ఈఎన్సీ, ఏపీ జెన్‌కో సీఈ సుజయ కుమార్ కోరారు. తెలంగాణ సమావేశానికి హాజరుకానందున తర్వాతి భేటీలో వీటిపై నిర్ణయం తీసుకుందామని కన్వీనర్ రవికుమార్ పిళ్లై సూచించారు.