- సీనియర్ ఐఏఎస్‌ల కమిటీకే అధ్యయన బాధ్యతలు
- ఇప్పటికే 11 శాతం ఫిట్‌మెంట్‌పై త్రీమెన్ కమిటీ నియామకం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ జేఏసీ డిమాండ్ల అమలుపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఆర్టీసీ విలీనంపై స్టడీ చేసేందుకు అధికారుల కమిటీ త్వరలో ఏపీలో పర్యటించనుంది. ఏపీలో ఈ మధ్యే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తయిన విషయం తెల్సిందే. కార్మికుల సమ్మె సమయంలో ఏర్పాటు చేసిన నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీకే అధ్యయన బాధ్యతను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కార్మిక శాఖ కార్యదర్శి దానకిశోర్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది.
ఇటీవల జరిగిన బదిలీల్లో దానకిశోర్ స్థానంలో హరిచందన కార్మికశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో కమిటీలో ఆమె భాగం కానున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి 11 శాతం పీఆర్సీ అమలుపై ఇప్పటికే త్రీమెన్ కమిటీని నియమించిన సర్కారు.. గుర్తింపు సంఘం ఎన్నికలపైనా చర్చలు జరిపాలని కార్మికశాఖ అధికారులను ఆదేశించింది. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం పూర్తికావడంతో అక్కడ ఈ ప్రక్రియ ఎలా జరిగిందన్నది కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
విలీనంపై ఒక కమిటీని నియమిస్తామని సమ్మె సందర్భంగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకంగా విలీనంపై కమిటీని ఏర్పాటు చేయడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కమిటీలో జేఏసీ ప్రతినిధులను కూడా సభ్యులుగా తీసుకోవాలని నిర్ణయించారు. ఏ యూనియన్‌కు సంబంధించిన వారిని సభ్యులుగా నియమించాలో కూడా తేల్చవలసిఉంది. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది కనుక చర్చల కోసం నియమించిన ఐఏఎస్‌ల కమిటీకే తాత్కాలికంగా విలీన ప్రక్రియ అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది.

