పెద్దిలో నేను కాదు.. అప్పలసూరినే కనిపిస్తాడు: జగపతిబాబు

పెద్దిలో నేను కాదు.. అప్పలసూరినే కనిపిస్తాడు: జగపతిబాబు

‘‘ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. అయితే 'పెద్ది' చిత్రంలో పోషించిన 'అప్పలసూరి' పాత్ర నా కెరీర్‌‌లోనే బెస్ట్‌‌గా టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచిపో తుంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. రామ్ చరణ్ హీరోగా  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్‌‌ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను గురించి జగపతిబాబు ఇలా వివరించారు.

    ‘పెద్ది’లో నేను పోషించిన అప్పలసూరి పాత్రను ట్రైలర్‌‌‌‌‌‌లో చూసినవాళ్లంతా కొత్తగా ఉంది అంటున్నారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే. ఆ పాత్ర అలా ఉండాలని బుచ్చిబాబు కోరుకున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌‌తో కలిసి నా లుక్‌‌ని డిజైన్ చేశారు. గెటప్‌‌ వేసుకోగానే ఆ పాత్ర అద్భుతంగా ఉండబోతోందని అర్థమైంది.

    గెటప్‌‌ మాత్రమే కాదు.. ఎమోషనల్‌‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది. సినిమాలో జగపతిబాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. ‘లెజెండ్’ తర్వాత చాలా సినిమాలు చేశా.  కానీ వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరు వుంటాయి. ఆ జాబితాలో అప్పలసూరి ఫస్ట్ ప్లేస్‌‌లో ఉంటుంది. ఇందులోని ఎమోషన్, లుక్, డెప్త్ ఏ పాత్రలోనూ లేదు. ఎందుకు ఇంతలా చెప్తున్నానో సినిమా చూశాక అర్థమవుతుంది. 

    ప్రోస్తెటిక్‌‌ మేకప్‌‌కు ప్రతిరోజు మూడు గంటల సమయం పట్టేది. అయితే దానికంటే కూడా డబ్బింగ్ చెప్పడం పెద్ద ఛాలెంజ్. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఒకరోజంతా కూర్చుని రెండే డైలాగ్స్‌‌ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.  ఆ పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఇంకెవ్వరూ కనిపించకూడదు అనేది నా ప్రయత్నం. ఆ పాత్రలో,  యాసలో ఓ మేజిక్ ఉంది. అందుకే నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. 

    తెరపై మన పాత్ర ఎంతసేపు కనిపిస్తుందనేది కాదు.. ఎంత ప్రభావం చూపిస్తుందనేది ముఖ్యం. అలా ప్రేక్షకుల మదిలో ఈ పాత్ర నిలిచిపోతుంది.  ఇందులో నాది చరణ్‌‌కు  తండ్రి పాత్ర కాదు. కానీ చాలా ప్రేమతో,  అనుబంధంతో ఉండే క్యారెక్టర్. నాకు, ‘పెద్ది’ పాత్రకు మధ్య బ్యూటిఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. 

    రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. తన పలకరింపులోనే ఒక ఆప్యాయత ఉంటుంది. నేనే కాదు మా ఫ్యామిలీ అంతా తనను ఇష్టపడతారు. ఈ చిత్రం కోసం తను ఎంత కష్టపడ్డాడో చూసి ఆశ్చర్యపోయా. దెబ్బలు తిన్నా, రక్తం కారినా, గాయాలైనా కేర్ చేయకుండా, డూప్‌‌ను వాడకుండా స్వయంగా చేశాడు. ‘రంగస్థలం’ నుంచి నటుడిగా ఎదుగుతూనే ఉన్నాడు. ప్రతి సినిమాకు మరింత అందంగా కనిపిస్తున్నాడు.