- కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎక్కువ మంది రెబల్స్.
- అసంతృప్తులను బుజ్జగిస్తున్న నేతలు. రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు.
- నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్ డ్రాకి చాన్స్
నల్గొండ, వెలుగు: మున్సిపల్ పోరులో నామినేషన్ విత్ డ్రాకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సీనియర్లు రంగంలోకి దిగుతున్నారు. మరోపక్క నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు , నలుగురు బరిలో నిలుస్తున్నారు. ఎలాగైనా మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. అభ్యర్డుల ప్రకటనతో టికెట్ తమకే కావాలంటూ చాలా చోట్ల ఆందోళన బాట పడుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశవాహులను బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
అసంతృప్తులను బుజ్జగిస్తున్న నేతలు.
సూర్యాపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి వర్గంలో టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. కాగా రెండు వర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. కొంతమంది ఆశావహులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను బుజ్జగించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు రంగంలోకి దిగారు.
హాలియా మున్సిపాలిటీలో 12 వార్డుల్లో మొత్తం 102 నామినేషన్లు వేశారు. ప్రధానంగా ఏడవ వార్డులో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, ఆ వార్డులో చైర్మన్ అభ్యర్థిగా చింతల చంద్రారెడ్డి బరిలో నిలిచారు. అదే వార్డులో పార్టీలోని రెబల్ గా కర్ణ నర్సిరెడ్డి తో పాటు మరికొందరు నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన వారిని బుజ్జగించేందుకుగాను నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న వ్యక్తుల్ని తమ నామినేషన్లు ఉపసంహరించుకునేలా పలు హామీలను ఇచ్చారు. కొంతమందికి పార్టీ పదవులను, రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేలా ఒప్పందాలను కుదుర్చుకు న్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో చాలా వార్డుల్లో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేయగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రెబల్స్ లేకుండా ఆశావాహులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
చండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి ఒక్కో వార్డుకు ఐదు నుంచి పది మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ఆశావాహులు టికెట్ దక్కని వారికి బీఆర్ఎస్ పార్టీలో చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చూస్తున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ బీజెపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇండిపెండెంట్‌లను ఉపసంహరించుకునేలా..
దేవరకొండ మున్సిపాలిటీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను బుజ్జగించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో మొత్తం138నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న వ్యక్తుల్ని నామినేషన్లు ఉపసంహరించుకుంటే పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు.
మిర్యాలగూడలో కొలిక్కిరాని పంచాయితీ
మిర్యాలగూడ మున్సిపాలిటీ సంబంధించిన పంచాయితీ కొలిక్కి రాలేదు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సోమవారం అంతర్గత సమావేశంలో నిర్వహించారు. తిరునగర్ భార్గవ్ తన అనుచరులతో కలిసి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పట్టుబడుతుండడంతో రాత్రి వరకు బరిలో ఉండకుండా విత్ డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే సోమవారం రాత్రి ఎంపీ రఘువీర్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా మిర్యాలగూడకు చేరుకొని వారితో చర్చలు జరపనున్నట్లు తెలిసింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాగైనా సమస్యను పరిష్కరించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
