ఉద్యోగాలు ఇచ్చే NCS పోర్టల్‍

ఉద్యోగాలు ఇచ్చే NCS పోర్టల్‍

హైదరాబాద్‍, వెలుగుఉన్నత చదువులు చదివినా అర్హతకు తగ్గ కొలువులు రాలేదని బాధపడే రోజులకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వ లేబర్, ఎంప్లాయిమెంట్‍ విభాగం ఆధ్వర్యంలోని ‘నేషనల్‍ కెరీర్‍ సర్వీస్‍ పోర్టల్‍’ నిరుద్యోగులకు అండగా నిలుస్తూ ఉన్నతోద్యోగాలను పొందేలా సహాయపడుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేట్‍ యూనివర్సిటీలు, ఇన్‍స్టిట్యూట్స్ లలో లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఎంబీఏ తదితర డిగ్రీలను సాధిస్తున్నారు. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య 10 శాతం దాటడం లేదని పలు సర్వేల్లో తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలోని నిరుద్యోగులకు ఐటీ, కార్పొరేట్‍ సంస్థల్లో ఉండే ఉద్యోగాల సమాచారం తెలియపోవడంతో వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోయేవారు. దాంతో వారు లోకల్‍గా ఉండే చిన్నా చితక కంపెనీల్లో ఉండే ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని దేశ వ్యాప్తంగా వివిధ ఐటీ, కార్పొరేట్‍ కంపెనీల్లో ఉన్న జాబ్స్ వివరాలను అందరికి తెలిసేలా నేషనల్‍ కెరీర్‍ పోర్టల్‍ను తీసుకొచ్చింది.

అర్హతలకు తగ్గ ఉద్యోగం రెడీ

గ్రేటర్‍లో ఉన్న ఇంజినీరింగ్‍ కాలేజీల నుంచి ఏటా ఉత్తీర్ణత సాధిస్తున్న వారిలో క్యాంపస్‍ ప్లేస్‍మెంట్‍లో ఉద్యోగాలు పొందుతున్న వారు 7–10 శాతం దాటడం లేదు. కంపెనీలను డైరెక్ట్ గా అప్రోచ్‍ అయి ఉద్యోగాలు పొందుతున్న వారు మరో 5 శాతం ఉంటారని నిపుణులు తెలిపారు. మిగతా విద్యార్థులు కొలువుల కోసం ఎదురు చూస్తు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరికి అదనంగా డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన వారు సైతం ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలోనే ఎదురు చూస్తున్నారు. నగరంలో అనేక ప్రైవేట్‍, కార్పొరేట్‍ కంపెనీలు ఉన్నా వాటిల్లో  ఉండే ఉద్యోగ వివరాలు నిరుద్యోగులకు తెలియడం లేదు. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెంట్‍ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద నుంచి అందినకాడికి వసూలు చేస్తున్నాయి. తమ అర్హతలకు తగ్గ ఉద్యోగం కాకపోయినా వచ్చిన ఉద్యోగంలో సర్దుకుపోతున్నారు. నిరుద్యోగులకు ఇక వాటి బారిన పడకుండా ఈ పోర్టల్‍ ఉపయోగపడుతుంది.

అందుబాటులో అన్ని ఉద్యోగాల సమాచారం 

నేషనల్‍ కెరీర్‍ పోర్టల్‍లో ఉన్నతోద్యోగాలతో పాటు  ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి. అదే విధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్‍ పూర్తి చేసిన వారికి, అసలు చదువు రాని వారికి సైతం అనేక ఉద్యోగాల వివరాలు ఇందులో ఉన్నాయి.  ఈ పోర్టల్‍లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ మేళాల వివరాలను నిర్వాహకులు పోర్టల్‍లో పెడుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నమోదు చేసుకున్న కంపెనీల్లో ఉద్యోగ వివరాలు ఉంటాయి. దీంతోపాటు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి జాబ్‍ సీకర్స్ అనే ఆప్షన్‍ కింది వివరాలను చూసుకునే వీలుంది. లోకల్‍ సర్వీస్ విభాగం కింద తక్కువ చదువుకున్న వారికి సెక్యూరిటీ గార్డులు, మెకానిక్‍, కుక్‍, టైలర్, కార్పెంటర్లు, బ్యూటీషియన్‍ తదితర కొలువుల వివరాలు సైతం ఉన్నాయి. పోర్టల్‍లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థుల ఫోన్‍లకు ఉద్యోగాల వివరాలు పంపడంతోపాటు వారి పరిధిలోని ఎంప్లాయిమెంట్‍ ఎక్ఛెంజ్‍ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‍మెళాల వివరాలను పంపే ఏర్పాటు చేశారు.

ఇలా నమోదు చేసుకోండి

ముందుగా  https://www.ncs.gov.in/  వెబ్‍సైట్‍లో లాగిన్‍ అవ్వాలి. అనంతరం ఏయే ఉద్యోగాలకు అర్హత ఉందో పోర్టల్‍లో నమోదు చేయాలి. తమ అర్హతలకు ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో సరిచూసుకోని ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. చివరగా సెక్యూరిటీ కోడ్‍ని నమోదు చేసిన సబ్మిట్ చేయగానే పోర్టల్‍ యూజర్‍ ఐడీ రావడంతో పాటు నమోదిత ఫోన్‍కు ఓటీపీ వస్తుంది.
దీన్ని నమోదు చేయగానే 19 డిజిట్‍ గల యూజర్‍ ఐడీ అలౌట్‍ అవుతుంది. దీనితో ప్రతిసారి లాగిన్‍ అయ్యి  ఏమేం ఉద్యోగాలు కొత్తగా వచ్చాయో చూసుకోవచ్చు.

పోర్టల్ వివరాలు

  • 1.05 కోట్ల మంది నిరుద్యోగులు పోర్టల్ లో నమోదు చేసుకున్నా రు.
  • 7840 ప్రైవేట్‍, కార్పొరేట్‍ కంపెనీలు ఉద్యోగా లు ఇచ్చేందుకు రిజిస్టర్‍ చేసుకున్నాయి.
  • 3.52 లక్షల కొలువులు భర్తీ చేసేందుకుఅందుబాటులో ఉన్నాయి.
  • 18004251514 టోల్‍ఫ్రీ నంబర్‍ నిరుద్యోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది.